logo

హైదర్‌నగర్‌ భూములపై విచారణ జులైకు వాయిదా

హైదరాబాద్‌లోని హైదర్‌నగర్‌ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌తో పాటు ఇతర ప్రైవేటు వ్యక్తులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. వాటికి సమాధానం ఇవ్వాలని పిటిషనర్లను

Published : 19 May 2022 02:11 IST

రాష్ట్ర ప్రభుత్వ ఇంప్లీడ్‌ పిటిషన్‌ను ఆమోదించిన సుప్రీంకోర్టు
 సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు ఆదేశం

ఈనాడు, దిల్లీ: హైదరాబాద్‌లోని హైదర్‌నగర్‌ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌తో పాటు ఇతర ప్రైవేటు వ్యక్తులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. వాటికి సమాధానం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం జులైకు వాయిదా వేసింది. హైదర్‌నగర్‌ సర్వే నం 172లోని 98.10 ఎకరాల భూములు తమకు చెందుతాయంటూ వ్యాపారవేత్త గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్‌ సంస్థలు, ఆయన సతీమణి ఇంద్రాణీ ప్రసాద్‌ తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేయగా వాటిని 2019, డిసెంబరు 20న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఏప్రిల్‌ 19, ఈ నెల 4న విచారించిన సుప్రీంకోర్టు యథాతథ స్థితిని కొనసాగిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఆ భూములపై సర్కారుకే అధికారం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆ భూములు సర్కారువని చెప్పేందుకు ప్రభుత్వానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశ్నించారు. ప్రభుత్వ ఇంప్లీడ్‌ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని