logo

పురుగుల బియ్యం తినలేని దైన్యం!

మహానగరంలో చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యంలో నాణ్యత లోపిస్తోంది. బియ్యంలో మట్టి, చెత్తాచెదారం వస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పౌరసరఫరాలశాఖ అధికారులు

Published : 19 May 2022 02:11 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మహానగరంలో చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యంలో నాణ్యత లోపిస్తోంది. బియ్యంలో మట్టి, చెత్తాచెదారం వస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉప్పల్‌లోని విజయ్‌పురి కాలనీలోని ఓ చౌక ధరల దుకాణంలో పురుగులు ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని, ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకుని మంచి బియ్యాన్ని సరఫరా చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. గతంలో ఉప్పల్‌లోని 37వ నంబరు దుకాణంలోనూ పురుగులతోపాటు బూజు పట్టిన బియ్యాన్ని సరఫరా చేయడం వివాదాస్పదమైంది.

రేపటి వరకు పంపిణీ.. నాసిరకం బియ్యం పంపిణీ చేస్తే వాటిని మేమేం చేయాలని లబ్ధిదారులు వాపోతున్నారు. కష్టకాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేస్తున్నారని మండిపడుతున్నారు. మే నెల కోటా కింద మెజారిటీ చౌకధరల దుకాణాలకు నాసిరకం బియ్యం పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. అధికంగా నాసిరకం బియ్యమే వచ్చాయని డీలర్లు పేర్కొంటున్నారు. డీలర్ల తప్పిదంతోనే ఇది జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కోటా బియ్యం సరిగా లేకపోయినా సమాచారం అందిస్తే వాటి స్థానంలో వేరే బియ్యం బస్తాలను పంపుతామని చెబుతున్నారు. గతంలో నిల్వ ఉంచిన స్టాక్‌పై కొత్త స్టాక్‌ సంచులను వేయడంతో కాలం గడుస్తున్న కొద్దీ పురుగులు పట్టే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. సాధారణంగా ప్రతినెలా 1వ తేదీ నుంచి 15 వరకు బియ్యం పంపిణీ జరుగుతుంది. ఇంకా ఎంతో మందికి రేషన్‌ బియ్యం చేరలేదు. దీంతో 20వరకు బియ్యం పంపిణీని చేపడుతున్నారు.  

తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు
నాసిరకం బియ్యాన్ని స్టేజ్‌ 2 కాంట్రాక్టర్లు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు చేరుస్తుండగా ఆ బియ్యాన్ని డీలర్లు కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. బియ్యంలో ఇసుక, మట్టి పెళ్లలు, పురుగులు ఉన్నాయని కార్డుదారులు డీలర్లను అడిగితే గోదాముల నుంచి అలాగే వస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 15.38 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. ప్రతి నెలా ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఐదుగురు ఉంటే 30 కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని