logo

బురిడీబాబాపై నాన్‌ బెయిలబుల్‌ కేసు: ఎస్పీ

అమాయకులను మోసం చేస్తూ బాబాగా చెలామణి అవుతున్న పరిగి మండలం నస్కల్‌ గ్రామానికి చెందిన రఫీక్‌ (25)ను పోలీసులు అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు.

Published : 20 May 2022 03:43 IST


వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి, ముసుగులో ఉన్న వ్యక్తి నిందితుడు

పరిగి: అమాయకులను మోసం చేస్తూ బాబాగా చెలామణి అవుతున్న పరిగి మండలం నస్కల్‌ గ్రామానికి చెందిన రఫీక్‌ (25)ను పోలీసులు అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిగి డీఎస్పీ జి.శ్రీనివాస్‌తో కలిసి స్థానిక సీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ధారూర్‌ మండలం కుక్కిందకు చెందిన యువతి వికారాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. వారం రోజులుగా నిద్రలో కలవరించడం, భోజనం సక్రమంగా చేయకపోవడం, తనకు తాను వింతగా ప్రవర్తిస్తుండటంతో అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో చూపించారు. కానీ ఎంతకూ తగ్గకపోవడంతో నస్కల్‌లో ఉంటున్న సమీప బంధవు రఫీక్‌ అనే వ్యక్తి ప్రతి శుక్రవారం తమ పొలం సమీపంలో ఉన్న దర్గా వద్ద తన శక్తులతో రోగాలను నయం చేస్తాడని సూచించాడు. ఈక్రమంలో ఈనెల 13న యువతి తల్లిదండ్రులు అతడి వద్దకు తీసుకు వెళ్లారు. రోగం నయం చేస్తానని చెప్పిన మంత్రగాడు నిప్పుల కుంపటి వద్ద యువతిని కూర్చోబెట్టి కాళ్లను, ఎడమ చేతిని కుంపటిలో పెట్టాడు. కానీ ఎంతకూ తగ్గకపోగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిపై చర్య తీసుకోవాలని కోరుతూ.. బాధితురాలి తల్లిదండ్రులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసును నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. బాలిక ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అవసరమైతే సెక్షన్లను కూడా మార్చుతామని అన్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కళాజాత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కోరుకున్న చోటికి బదిలీ చేసే బాధ్యత నాది: ఎస్పీ

వికారాబాద్‌: పోలీసు కానిస్టేబుళ్లను కోరుకున్న చోటికి బదిలీ చేసే బాధ్యత, సమస్యలను పరిష్కరించి యోగక్షేమాలను చూసే బాధ్యత తనదని, అయితే సమర్థ.వంతంగా విధులు నిర్వహించి ప్రజల్లో పోలీసుశాఖకు మంచి పేరు తెచ్చే బాధ్యత మీదని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ఠాణాల్లో దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న 49 మంది పోలీసు కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి కోరుకున్న ఠాణాకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పని చేసి సత్సంబంధాలను కలిగి ఉండే అవకాశం కానిస్టేబుళ్లకు ఎక్కువగా ఉంటుందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కేసుల పరిశోధనలో ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, డీసీఆర్‌బీ సీఐ అప్పయ్య, ఏఓ వందన తదితరులు పాల్గొన్నారు.

మూఢనమ్మకాలతో అనర్థం

వికారాబాద్‌టౌన్‌: మూఢనమ్మకాలను దరి చేరనియొద్దని ఎమ్మెల్యే ఆనంద్‌ ప్రజలకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుక్కిందకు చెందిన యువతిని పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్లకు సూచించారు. దొంగబాబాలను గుర్తించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి తుకారాం, ఇతర అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని