logo

చెంతకు చేరని.. చౌక బియ్యం!

బషీరాబాద్‌ మండలం వాల్యానాయక్‌ తండాలో చౌకదుకాణం లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి పంచాయతీ దామర్‌చేడ్‌ డీలరు వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు.

Published : 20 May 2022 03:43 IST

దుకాణాల ఏర్పాటు ప్రకటనకే పరిమితం

అనుబంధ పంచాయతీలు, గిరిజన తండాల్లో ఇబ్బందులు

న్యూస్‌టుడే, పాత తాండూరు, బషీరాబాద్‌

* బషీరాబాద్‌ మండలం వాల్యానాయక్‌ తండాలో చౌకదుకాణం లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి పంచాయతీ దామర్‌చేడ్‌ డీలరు వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో పంచాయతీ ట్రాక్టరులో తన సొంత ఖర్చులు రూ.1,200 వెచ్చించి ఊరిలోనే పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

* యాలాల మండలం దుబ్బతండాకు చెందిన గిరిజనులు ముద్దాయిపేటకు వెళ్లి రేషన్‌ బియ్యం తెచ్చుకుంటున్నారు.

దూరాభారంతో అవస్థలు తప్పడం లేదని గిరిజనులు వివరిస్తున్నారు. పెద్దేముల్‌ మండలం కందనెల్లిలోనూ ఇదే పరిస్థితి. కొత్త పంచాయతీ ఏర్పాటైనప్పటికీ దుకాణం లేకపోవడంతో కందనెల్లి లేదా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజీపూర్‌కు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇలా.. రూపాయికి కిలోబియ్యం చొప్పున 20కిలోల బియ్యానికి రూ.20 వెచ్చిస్తే.. ఆటోకే రూ.50 చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఉన్న ఊరిలోనే దుకాణం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలు పంచాయతీలుగా ఏర్పాటు చేసి, ఏళ్లు గడుస్తోంది. అయితే ప్రత్యేకంగా ఊరిలోనే చౌక ధరల దుకాణం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీటిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం రెండేళ్ల కిందటే ప్రకటన చేసినా అమలుకు నోచడం లేదు. ఊరి నుంచి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి పంచాయతీకి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 566 పంచాయతీలున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌, తాండూరు మండలాల్లో గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలున్నాయి. కొన్ని గిరిజన తండాల్లో చౌక ధరల దుకాణం ఉన్నప్పటికీ ఎక్కువశాతం కొత్త పంచాయతీలైన తండాల్లో దుకాణాలు లేవు. దీంతో పాత పంచాయతీ గ్రామాలకు వెళ్లి ఒకటిరెండు రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని వాపోతున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 149 గ్రామాల్లో చౌక ధరల దుకాణాలున్నాయి. కొత్త గిరిజన తండాల్లో ఇంకా అవసరమని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు నివేదికలను జిల్లా అధికారులకు పంపించారు. తండాల్లో మరో 20వరకు అవసరమవుతాయని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 60కి పైగా అవసరమని అంచనా వేస్తున్నారు.


సొంత ఖర్చులతో ఊరికి తెప్పిస్తున్నా

శివనాయక్‌, సర్పంచి, వాల్యానాయక్‌ తండా

మా తండాలో 60 బస్తాల బియ్యం అవసరం అవుతాయి. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దామర్‌చేడ్‌ డీలరు పరిధిలో ఉంటుంది. అక్కడికి వెళ్లి తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని సొంతంగా రవాణా ఖర్చు భరించి తెప్పిస్తున్నా. డీలరును ఇక్కడికే రప్పించి పంపిణీ చేయిస్తున్నా. కొత్తది ఏర్పాటు చేస్తేనే కష్టాలు తీరుతాయి.


ప్రయాణ భారం తగ్గుతుంది

హన్మిబాయి, సర్పంచి, ఇస్మాయిల్‌పూర్‌ తండా

మా తండావాసులు బియ్యం తీసుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీళ్లపల్లికి వెళ్లాల్సి వస్తోంది. రూపాయికి బియ్యం కిలో వస్తే.. రవాణాకు ఒక్కొక్కరికి రూ.50 ఖర్చు అవుతున్నాయి.


కొత్త వాటికి పరిశీలన జరుగుతోంది

రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, వికారాబాద్‌.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగా ఎక్కడెక్కడ చౌకధరల దుకాణాలు అవసరమో రెవెన్యూ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇదివరకే ఎన్ని దుకాణాలు అవసరమో ఉన్నతాధికారులకు పంపించాం. మరోసారి పరిశీలన జరుగుతోంది. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని