Telangana News: పోలీసు నియామకాలు.. మరోసారి అభ్యర్థుల వయోపరిమితి పెంపు

తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 20 May 2022 15:01 IST

హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు నియామక మండలి చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ఈ విధానాన్ని మొదటిసారిగా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని తెలంగాణ యువత కోల్పోయిన నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. యూనిఫాం పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో మరికొంత మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించినట్లు అయింది. కాగా, దరఖాస్తు ప్రక్రియ గడువును ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని పోలీసు నియామక మండలి గతంలోనే తేల్చి చెప్పింది. గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు మరికొంత సమయాన్ని ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఈ రోజు రాత్రి 10గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో 17,291 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమమైన దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తకుండా అధికారులు సామర్థ్యాన్ని పెంచారు. నిన్న ఒక్క రోజే లక్ష దరఖాస్తులు వచ్చాయి. ఒకేసారి నగదు చెల్లింపులు జరుపుతుండటంతో, సాంకేతికత సమస్యలు తలెత్తుతున్నాయి. చెల్లింపు విఫలమైనట్లు సందేశం వస్తున్నా.... నగదు మాత్రం ఖాతాలో నుంచి డెబిట్ అవుతోందని అభ్యర్థులు, అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. నగదు సఫలీకృతమైతేనే దరఖాస్తు ప్రక్రియ పూర్తవతుందని పోలీసు నియామక మండలి అధికారులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 10లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని