logo

పరువే ప్రధానం..తృణ ప్రాణం

పిల్లలను పెంచి పెద్దచేసిన కొందరు తల్లిదండ్రులు.. వారి అభీష్టాలకు వ్యతిరేకంగా పెళ్లిచేసుకుంటే చాలు హంతకులుగా మారుతున్నారు. బంధువులు.. స్నేహితులు.. సంఘంలో పరువు తీశారన్న అవమానభారంతో దారుణానికి ఒడిగడుతున్నారు. కులం, జాతి, మతం ముఖ్యమని హత్యలు చేస్తున్నారు.

Updated : 21 May 2022 11:10 IST

● నచ్చనివారిని చేసుకుంటే అంతమొందిస్తున్నారు

● జైలు.. శిక్షలు లెక్కచేయని తల్లిదండ్రులు, సోదరులు


మే 4న: నాగరాజు మృతదేహం వద్ద రోదిస్తున్న అశ్రిన్‌

ఈనాడు, హైదరాబాద్‌: పిల్లలను పెంచి పెద్దచేసిన కొందరు తల్లిదండ్రులు.. వారి అభీష్టాలకు వ్యతిరేకంగా పెళ్లిచేసుకుంటే చాలు హంతకులుగా మారుతున్నారు. బంధువులు.. స్నేహితులు.. సంఘంలో పరువు తీశారన్న అవమానభారంతో దారుణానికి ఒడిగడుతున్నారు. కులం, జాతి, మతం ముఖ్యమని హత్యలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం షాహినాయత్‌గంజ్‌ ఠాణా పరిధిలో నీరజ్‌ పన్వర్‌ అనే యువకుడిని అతడి భార్య కుటుంబ సభ్యులు కిరాతకంగా చంపేశారు. మే4న సరూర్‌నగర్‌లోనూ మతాంతర వివాహం చేసుకున్న నాగరాజును అతడి భార్య అశ్రిన్‌ సోదరుడు దారుణంగా హత్య చేశాడు.

సూటిపోటిమాటలు.. కులాంతర, ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వారిని చంపెయ్యాలన్న కసి కొందరు తల్లిదండ్రుల్లో ఏర్పడుతోంది. బంధువులు, స్నేహితుల సూటిపోటిమాటలు వారిలో ఆగ్రహావేశాలు రగిలిస్తున్నాయి. తమ పరువు తీసేందుకే ఇలా చేశారంటూ ఘాతుకాలకు ఒడిగడుతున్నారు.

మే 20న: నీరజ్‌ పన్వర్‌

పక్కా ప్రణాళికతోనే..

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. జైలుకు వెళ్తామని తెలిసినా తెగించి మరీ హత్యలు చేస్తున్నారు. పైకి ప్రేమ నటిస్తూనే ఎప్పుడు చంపాలి? ఎలా చంపాలి? అన్నఅంశాలను ప్రణాళిక రూపొందించి అనువైన సమయంలో అంతమొందిస్తున్నారు. ఒక్కోసారి కూతురు, కొడుకులతో పాటు అల్లుడు, కోడలిని కలిపి మరీ హత్యలు చేస్తున్నారు.

చందానగర్‌లో నివాసముంటున్న దొంతిరెడ్డి అవంతి.. హేమంత్‌ అనే యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆస్తికోసమే హేమంత్‌ అవంతిని పెళ్లిచేసుకున్నాడన్న కక్షతో అవంతి తల్లిదండ్రులు అతడిని చంపించాలనుకున్నారు 2020లో. అవంతి బాబాయ్‌ ముగ్గురు సుపారీ హంతకులను ఆశ్రయించాడు. మాట్లాడుకుందాం రావాలంటూ హేమంత్‌ను కారులో తీసుకెళ్లి మార్గమధ్యలో దారుణంగా చంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని