logo

టమాటా కొంటారా..

సంతలైనా.. కిరాణా దుకాణాలైనా.. సూపర్‌ మార్కెట్లయినా.. టమాటా ధర రూ.80 నుంచి రూ.95 పలుకుతోంది. ఇక బీన్స్‌ ధర అయితే రూ.150 దాటేసింది. స్థానికంగా టమాటా సాగు పూర్తవడంతో దూరం నుంచి వస్తున్నది కిలో రైతుబజారులోనే రూ.55 వరకూ పలుకుతోంది.

Published : 21 May 2022 06:00 IST

బీన్స్‌ బేరమాడగలరా?

రోజు రోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు

ఈనాడు, హైదరాబాద్‌: సంతలైనా.. కిరాణా దుకాణాలైనా.. సూపర్‌ మార్కెట్లయినా.. టమాటా ధర రూ.80 నుంచి రూ.95 పలుకుతోంది. ఇక బీన్స్‌ ధర అయితే రూ.150 దాటేసింది. స్థానికంగా టమాటా సాగు పూర్తవడంతో దూరం నుంచి వస్తున్నది కిలో రైతుబజారులోనే రూ.55 వరకూ పలుకుతోంది. గుండు బీన్స్‌ ధర కిలో రూ.105 అయితే బయట రూ.150చొప్పున అమ్ముతున్నారు. నగరానికి కూరగాయల రాక కూడా తగ్గిపోవడంతో ఏది చూసినా రూ.50లోపు కిలో దొరకని పరిస్థితి. రైతు బజార్లలో కొన్ని దొరుకుతున్నా త్వరగానే అయిపోతున్నాయి.

రెట్టింపు ధరకు..

నల్ల వంకాయ ధర రూ.25 రైతు బజారులో ఉంటే.. రిటైల్‌ అమ్మకం దారులు రూ.50 దాటించేశారు. పచ్చిమిర్చి రూ.40 రైతుబజారులో ఉంటే.. రిటైల్‌లో కిలో రూ.70 నుంచి రూ.80కి తక్కువ లేకుండా అమ్మేస్తున్నారు. ఇలా ఏ కూరగాయ ధర చూసినా రైతుబజారుకంటే రెట్టింపు ధరకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. టమాటా కిలో రూ.15లోపు దొరికిన సమయంలో నగరానికి 4 వేల క్వింటాళ్లు వస్తుండేది. ఇప్పుడు కేవలం 1500ల క్వింటాళ్లే వస్తోందని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఒక్క నిజామాబాద్‌ అంకాపూర్‌ నుంచి వస్తుంటే.. చిత్తూరు, అనంతపురం రైతులు పంట పొలం దగ్గరే కిలో రూ.50వరకూ రావడంతో అమ్మేసుకుంటున్నారు. అన్ని కూరల్లో వినియోగించే టమాటా ధర ఆకాశాన్ని అంటడంతో వినియోగదారులు కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు.


పంటలు బాగా ఉన్నప్పుడు నగరానికి రోజు వచ్చే కూరగాయలు: దాదాపు 30,000 క్వింటాళ్లు

ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్లకు వస్తున్నవి: 19500 క్వింటాళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని