logo

అంధుల చదువుకు ఆలంబన!

అలహాబాద్‌కు చెందిన సోనమ్‌చౌదరి(23)కి పుట్టుకతోనే దృష్టి లోపం ఉంది. అయినా చదువులో రాణిస్తోంది. చూపు ఆనక చదువుకోవడం కష్టమయ్యేది. ఇటీవల ఆమె వైద్యం కోసం హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు వచ్చారు. మాటల మధ్యలో

Published : 21 May 2022 06:00 IST

● ఆడియో పుస్తకాలు రూపొందించిన ఎల్వీప్రసాద్‌ నేత్ర సంస్థ

● సివిల్స్‌, గ్రూప్స్‌, టెట్‌కు సిద్ధమయ్యే వారికి వెసులుబాటు


ఆడియో బుక్స్‌ గురించి వివరిస్తున్న వాలంటీరు

ఈనాడు, హైదరాబాద్‌: అలహాబాద్‌కు చెందిన సోనమ్‌చౌదరి(23)కి పుట్టుకతోనే దృష్టి లోపం ఉంది. అయినా చదువులో రాణిస్తోంది. చూపు ఆనక చదువుకోవడం కష్టమయ్యేది. ఇటీవల ఆమె వైద్యం కోసం హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు వచ్చారు. మాటల మధ్యలో సివిల్స్‌ రాయాలనేది తన కల అని, చదువుకోవడం కష్టమవుతోందని వైద్యుల వద్ద వాపోయారు. సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఆమెను అక్కడి పునరావాస కేంద్రానికి పంపారు. సోనమ్‌ కథ విన్న వైద్యులు ఆమె కోసం ప్రత్యేకంగా యూపీపీఎస్‌సీ సిలబస్‌ను ఆడియో బుక్స్‌గా మార్చి ఇటీవలే సోనమ్‌కు అందించారు.

మరెందరికో ఉపయోగం..

దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవడం కష్టం కాబట్టి ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ ఆడియో బుక్స్‌ తయారు చేసి అందిస్తోంది. వీటిని చరవాణిలోనూ వినొచ్ఛు సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ బుక్స్‌ను రూపొందిస్తున్నారు. తాజాగా తెలంగాణలో గ్రూప్స్‌-1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మున్ముందు గ్రూపు-2, ఇతర పోస్టులకు నోటిఫికేషన్‌ రానుంది. ఈ నేపథ్యంలో ఈ ఆడియోల రూపకల్పన జరుగుతోంది. పేద అభ్యర్థులకు వీటిని ఉచితంగానే ఇవ్వనున్నారు. ఇప్పటికే అంధ విద్యార్థుల కోసం ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఆడియో పుస్తకాలను తయారు చేసింది.

700 మంది వాలంటీర్ల సేవలు

ఈ ఆడియో బుక్స్‌ తయారు చేయడం మాటలు కాదు. ప్రతి విషయాన్ని నాణ్యంగా రికార్డు చేయాలి. స్టూడియోల అవసరం ఉంది. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌లో ప్రత్యేకంగా ఇలాంటి స్టూడియోలు ఏర్పాటు చేసింది. 700 మంది వాలంటీర్లు ఈ క్రతువులో నిత్యం పాలు పంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఆంగ్లం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఆడియోలు రూపొందించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని