logo

అప్పులు ఇచ్చి.. తప్పుడు చేష్టలు

రుణయాప్‌ల వేధింపులు తాళలేక ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రభుత్వ అధికారి సహా తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు. నెలరోజుల్లో 93కేసులు నమోదు చేసిన పోలీసులు బాధితుల ఫిర్యాదులను

Published : 21 May 2022 06:17 IST

శ్రుతిమించుతున్న చైనా రుణయాప్‌ల ఆగడాలు
వేధింపులు తాళలేక బలవన్మరణాలు

రుణయాప్‌ల వేధింపులు తాళలేక ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రభుత్వ అధికారి సహా తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు. నెలరోజుల్లో 93కేసులు నమోదు చేసిన పోలీసులు బాధితుల ఫిర్యాదులను పరిశీలించి ఇవన్నీ కొత్తయాప్‌లుగా గుర్తించారు.
ఈనాడు, హైదరాబాద్‌: సులభంగా రుణం ఇస్తాం తీసుకోండి అంటూ యాప్‌ల ద్వారా అప్పులిస్తున్న చైనా సంస్థలు వేధింపులు.. చిత్రహింసల స్థాయిని పెంచాయి. చైనా సంస్థల యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న వారు అప్పు చెల్లిస్తున్నా.. చెల్లించినా వేధింపులు మాత్రం ఆగడం లేదు. 24గంటలూ ఫోన్లకు సందేశాలు.. సన్నిహితులు.. మిత్రులకు బాధితుల పరువుకు భంగం కలిగించే ఫొటోలు, వీడియోలను పంపుతున్నారు. వీటికి అదనంగా టెలీకాలర్ల దుర్భాషలు.. అసభ్య పదజాలాన్ని భరించలేక బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణయాప్‌ల వేధింపులు తాళలేక జియాగూడకు చెందిన రాజ్‌కుమార్‌ గతనెల ఆత్మహత్య చేసుకున్నాడు.

దుర్భాషలు.. నగ్నచిత్రాలు.. రేపిస్టులు
రుణయాప్‌ల నుంచి డబ్బు తీసుకుంటున్న వారిని టెలీకాలర్లు, చైనా సంస్థలు మూడోరోజు నుంచే వేధిస్తున్నారు. వేర్వేరు పద్ధతుల్లో మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు. చాలామంది పరువుపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.

* పురుషులు అప్పు తీసుకుంటే.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కార్యాలయాల్లో సహచరుల ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో వారి ఫొటోలపై నమ్మకద్రోహులు.. రేపిస్టులు.. అమ్మాయిల విక్రేతలంటూ రాస్తున్నారు.

* మహిళలు రుణయాప్‌ల ద్వారా అప్పు తీసుకుంటే వారం రోజుల్లోపు అసలు, వడ్డీ ఇవ్వాల్సిందే. లేదంటే వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి భర్త, పిల్లలు, సమీప బంధువుల చరవాణులకు పంపుతున్నారు. ఈమె అప్పు తీసుకోవడంతోపాటు డబ్బుకోసం ఏదైనా చేస్తోందంటూ నగ్నవీడియోలకు బాధితురాలి ముఖాన్ని అతికించి పంపుతున్నారు.

* రుణం చెల్లించాం.. మీకూ మాకూ సంబంధం లేదంటూ గట్టిగా టెలీకాలర్లను నిలదీస్తే... బాధితుల ప్రమేయం లేకుండా అప్పటికప్పుడు యాప్‌ల ద్వారా మళ్లీ అప్పు ఇస్తున్నారు.

50 యాప్‌లు..
యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగానే... రూ.50వేల రుణం ఇస్తారు. దీన్ని వడ్డీతో సహా చెల్లించేందుకు సమయం సరిపోకపోతే మరో యాప్‌ ద్వారా అప్పు ఇస్తారు. ఇలా ఒకే వ్యక్తికి యాభైకిపైగా యాప్‌ల ద్వారా రుణాలిస్తారు. రుణాలు చెల్లించేందుకు డబ్బు లేక బాధితుల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

పోలీసులేమంటున్నారంటే..
వ్యక్తిగత పూచీకత్తు లేకుండా రుణాలిస్తామంటూ చరవాణులకు సంక్షిప్త సందేశాలొచ్చినా.. యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ అభ్యర్థించినా పట్టించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. 

* పదిహేను రోజుల్లో డబ్బు తిరిగి చెల్లించండి.. ఇందులో మోసం లేదు అంటూ వేర్వేరు యాప్‌లను కాల్‌సెంటర్‌ నిర్వాహకులు పంపుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.

* స్నేహితులు, పరిచయస్థులు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే.. రుణయాప్‌ల ద్వారా అప్పుతీసుకుంటే.. పోలీసులకు ఫిర్యాదు చేసి రుణం చెల్లించాల్సిన అవసరం లేదని వారికి చెప్పండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని