Telangana news: అధికారం ఉందని విచక్షణ లేకుండా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు: ఈటల రాజేందర్‌

సంపన్న రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్‌ దివాళా తీయించారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. రాష్ట్ర అప్పు ఇప్పటికే రూ.5 లక్షల కోట్లు దాటిందని తెలిపారు.

Published : 22 May 2022 01:42 IST

హైదరాబాద్: సంపన్న రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్‌ దివాళా తీయించారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. రాష్ట్ర అప్పు ఇప్పటికే రూ.5 లక్షల కోట్లు దాటిందని తెలిపారు. కేసీఆర్‌ డొల్లతనాన్ని కాగ్‌ సైతం బయటపెట్టిందని పేర్కొన్నారు. అయితే కాగ్ నివేదికలు బయటకు రాకుండా దాచిపెట్టారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. అప్పులు చేసి రాచరికం అనుభవించడం తప్ప.. అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు ఏవీ అప్పులు తీర్చే పరిస్థితిలో లేవని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలకు దేశమంతా ఒకే విధానం వర్తిస్తుందని పేర్కొన్నారు. మంత్రులకు వారి శాఖల మీద ఎలాంటి అవగాహన లేదని.. వారి మాటలకు విలువ లేదన్నారు. మిల్లర్లు క్వింటాల్‌కు 8 కిలోలు తరుగు తీస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారని ఈటల మండిపడ్డారు.

‘‘అధికారం ఉంది కదా అని.. విచక్షణ లేకుండా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు. తెలంగాణ ప్రజలను ఎదుర్కొనేందుకు ధైర్యం లేకనే జాతీయ రాజకీయాలు అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో తలదూర్చితే.. తెదేపా అధినేత చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది. రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారం మాట్లాడటం మానుకోవాలి. మోదీకి కాదు ప్రధాని కుర్చీకి గౌవరం ఇవ్వాలన్న కేసీఆర్.. ఇవాళ ప్రధానిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ప్రధాని పర్యటన ఉందని తెలిసి.. మోదీకి ముఖం చూపించే దైర్యం లేకనే దిల్లీ పర్యటనకు వెళ్లారని అన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌కు నిబద్ధత ఉంది కాబట్టే విద్యా, వైద్య రంగాల్లో ప్రగతిని సాధించారు’’ అని ఈటల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని