logo

వరికి నష్టం... చెరకుకు లాభం

జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షం వరి పంటకు నష్టం కలిగించగా చెరకు పంటకు మాత్రం లాభం చేకూర్చింది. పెద్దేముల్‌ మండలంలో సుమారు 1800 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు.

Published : 22 May 2022 03:46 IST

అకాల వర్షాల ప్రభావం


రేగడిమైలారంలో నీట మునిగిన వరి పంట

పెద్దేముల్‌, న్యూస్టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షం వరి పంటకు నష్టం కలిగించగా చెరకు పంటకు మాత్రం లాభం చేకూర్చింది. పెద్దేముల్‌ మండలంలో సుమారు 1800 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉంది. అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల దెబ్బతింది. పొలాలు నీరు చేరి బురదగా మారాయి.

* పెద్దేముల్‌ మండలంలో 3 వేలకు పైగా ఎకరాల్లో చెరకు పంట సాగవుతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షం చెరకు పంటకు మేలు చేసింది.

బొంరాస్‌పేట: మండలంలోని వివిధ గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. కోత పనులు జోరుగా సాగుతుండగా వర్షాలతో నీళ్లల్లోని వరి గింజలు మెలకెత్తుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ధారూర్‌: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం 80.06 ఎంఎం వర్షాపాతం నమోదైంది. పలు గ్రామాల్లో వరి, జొన్న, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి.

తడిసిన మొక్కజొన్నను పెద్దేముల్‌ బస్టాండులో ఆరబెడుతున్న రైతుల

సాయం చేసి ఆదుకోండి..

వికారాబాద్‌ గ్రామీణ: ‘ఉన్న ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం వెంటనే సాయం చేసి ఆదుకోవాలని’ మైలార్‌దేవరంపల్లి గ్రామానికి చెందిన పుట్ట అంజయ్య విన్నవించారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆర్‌ఐ సురేష్‌, పంచాయతీ కార్యదర్శి రాజు ఇంటిని పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తామని తెలిపారు.

కొడంగల్‌: వర్షం దెబ్బకు అప్పాయిపల్లి తండా సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన సామగ్రి కొట్టుకు పోయింది. వర్షా కాలం ప్రారంభానికి ముందే శుక్రవారం ఒక్కరోజే 8 సెం.మీ వర్షం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

దౌల్తాబాద్‌: అకాల వర్షంతో పంట పొలాలన్నీ కుంటలను తలపించాయి. మరో 10 రోజుల వరకు పొలాల్లోకి వెళ్లే పరిస్థితి లేదని రైతులు వాపోయారు.

పరిగి గ్రామీణ: ఈదురు గాలులతో కూడిన వర్షం 3 గంటలపాటు కురవడంతో కోతకొచ్చిన వరిపైరు పొలాల్లోనే నేలవాలి నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మైలార్‌దేవరంపల్లిలో కూలిపోయిన ఇల్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని