logo

రైతు వేదికలు... ఇక వీఏఓ కార్యాలయాలు..!

గ్రామాల్లోని రైతు వేదికలు ఇక ప్రభుత్వ కార్యాలయాలుగా మారనున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వేదికలు కొన్ని చోట్ల అలంకారప్రాయంగా మిగిలాయి. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు వ్యవసాయ సహాయ విస్తరణాధికారి

Published : 22 May 2022 03:46 IST
అమలుకు సర్కారు సన్నాహాలు

న్యూస్‌టుడే, పరిగి: గ్రామాల్లోని రైతు వేదికలు ఇక ప్రభుత్వ కార్యాలయాలుగా మారనున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వేదికలు కొన్ని చోట్ల అలంకారప్రాయంగా మిగిలాయి. ప్రజాధనం వృథా కాకుండా ఉండేందుకు వ్యవసాయ సహాయ విస్తరణాధికారి (ఏఈఓ) కార్యాలయాలుగా మార్చేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. తద్వారా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వెంటవెంటనే రైతులకు చేరతాయని, ఇటు వీరికి రైతులకు, అటు సిబ్బందికి ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది. ఈనెల 18న హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వానా కాలం సాగు సన్నాహక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇదే విషయాన్ని తెలిపారు. ఇక మీదట వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను రైతు వేదికల్లోనే నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. జిల్లా అధికారులు సైతం కార్యాచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

రూ.21.78 కోట్లతో..

జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 19 మండలాల్లో వ్యవసాయ శాఖ 99 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. 101 మంది ఏఈఓలకు ప్రస్తుతం 85మంది విస్తరణాధికారులు పనిచేస్తున్నారు. అన్ని క్లస్టర్లలో రైతుల వేదికల నిర్మాణాన్ని గతేడాది పూర్తి చేశారు. ఇందుకోసం శాఖా పరమైన నిధులు రూ.12లక్షలు, ఉపాధిహామీ నిధులు రూ.10లక్షల చొప్పున ఒక్కోదానికి రూ.22లక్షలు వెచ్చించారు. మొత్తంగా ఆయా ప్రాంతాల్లో చేసిన ఖర్చు అక్షరాలా రూ.21.78కోట్లు. గతేడాది వానాకాలం నాటికి వ్యవసాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నా చాలా ప్రాంతాల్లో ఊరికి దూరంగా నిర్మాణం చేశారు. దీంతో సమావేశాల నిర్వహణకు అక్కడకు చేరుకునేందుకు అన్నదాతలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనిని గుర్తించిన ప్రభుత్వం కార్యాలయాలుగా మార్చితే లక్ష్యం నేరవేరుతుందని యోచిస్తోంది.

నిత్యం అందుబాటులో..

ప్రతిరోజూ ఏఈఓలు ఉదయం 9గంటలకు రైతు వేదిక వద్దకు వచ్చి పది గంటల తరువాత పంట పొలాలకు వెళ్లాలి. తిరిగి 3గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5గంటల వరకు వేదికల్లో అందుబాటులో ఉంటారు. సాగు సమస్యలపై ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేయాలి. క్లస్టర్‌ పరిధిలో 5నుంచి 8 గ్రామాల వరకు 5వేల నుంచి దాదాపు 7,500 ఎకరాల వరకు విస్తీర్ణం ఉంది. దీంతో ఒక్కోసారి ఏ గ్రామంలో ఉంటున్నారో రైతులకు తెలియకుండా పోతోంది. ఇకమీదట రైతు వేదికలు కార్యాలయాలుగా మారితే నిత్యం వారు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ప్రతినెలా నిర్వహణ నిధులు

కార్యాలయాల నిర్వహణకు ప్రతినెలా నిధులు రూ.9వేల చొప్పున అందజేస్తారు. రైతు వేదికలకు గతంలోనే ప్రభుత్వం ఫర్నీచర్‌ను అందజేసింది. ఈక్రమంలో ఒక్కోదానికి పది కుర్చీలు, అల్మారా, మైకు తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చింది. వేదికల వద్ద శౌచాలయాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది.


క్షేత్ర స్థాయి కష్టాలు తెలుస్తాయి

- మేడిద రాజేందర్‌, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు

క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అధికారుల దృష్టికి వెళ్తాయి. స్థానికంగా ఉంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు తెలుస్తాయి. పంటల సీజన్‌ సమయంలో విత్తనాలు, ఎరువుల కొరత అన్నది రాకుండా చూసేందుకు ఆస్కారముంది.


తాజా సమాచారం అందుతుంది

- గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

నిత్యం ఏఈఓలు అందుబాటులో ఉంటే చాలా వరకు సమస్యలను నివృత్తి చేసుకుని మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. సాగులో సూచనలు, సలహాలను, సాంకేతిక పద్ధతుల వినియోగం, యాజమాన్య పద్ధతులు అందిస్తారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు నివేదికల ద్వారా తాజా సమాచారం కూడా అందనుంది. శాఖా పరంగా అమలు చేస్తున్న రాయితీలు, ఇతరత్రా సమాచారం కూడా రైతుల చెంతకు సకాలంలో చేరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని