logo

తనువు చాలిస్తూ.. పలువురికి జీవితం ఇస్తూ..

తీవ్ర రక్తపోటుతో ఆస్పత్రిలో చేరిన యువకుడు మెదడులో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. బతికేందుకు ఎలాంటి అవకాశాలు లేవని వైద్యులు నిర్ధారించడంతో యువకుడి భార్య, తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకొచ్చారు.

Published : 22 May 2022 03:46 IST

యువకుడి అవయవదానానికి కుటుంబసభ్యుల అంగీకారం

గజ్వేల్‌, న్యూస్‌టుడే: తీవ్ర రక్తపోటుతో ఆస్పత్రిలో చేరిన యువకుడు మెదడులో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. బతికేందుకు ఎలాంటి అవకాశాలు లేవని వైద్యులు నిర్ధారించడంతో యువకుడి భార్య, తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకొచ్చారు. పలువురికి జీవితాన్నిచ్చి వారిలో మా వాడిని చూసుకుంటామని వారు అంటున్నారు. గజ్వేల్‌కు చెందిన మామిండ్ల ఐలయ్య-బాలమణిల చిన్న కుమారుడు మామిండ్ల నాగరాజు(35) సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి ఐసీయూ (ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లో సహాయకుడిగా పని చేస్తున్నారు. రెండ్రోజుల కిందట అధిక రక్తపోటుకు గురవగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయాడు. మెదడులో రక్తనాళాలు చిట్లడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. దీంతో వైద్యులు అవయవదానానికి సంప్రదించగా పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని అంగీకరించారు. గుండె, కాలేయం, కిడ్నీలు తదితరాలను సేకరించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. అతనికి భార్య మనీషా, ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులున్నారు.

మంత్రి హరీశ్‌రావు ఆరా..

నాగరాజు రక్తపోటుకు గురై ఆస్పత్రిలో చేరి కోమాలోకి వెళ్లిన విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. యువకుడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని