logo
Updated : 22 May 2022 06:08 IST

ప్రమాద కారకాలు ఆరు

నగరంలో బిట్స్‌ పిలానీ ఆచార్యుల అధ్యయనం
పలు పరిష్కార మార్గాల సూచన
ఈనాడు, హైదరాబాద్‌

రాజధానిలో జరిగే రోడ్డు ప్రమాదాలకు ఆరు రకాల కారకాలు(కేటగిరీలు) ఉన్నట్లు బిట్స్‌ పిలానీ-హైదరాబాద్‌ క్యాంపస్‌ పరిశోధకులు గుర్తించారు. ఆమేరకు భద్రత చర్యలు పాటిస్తే నియంత్రణ సాధ్యమని సూచించారు. కరోనా నేపథ్యంలో 2015-19 మధ్య జరిగిన ప్రమాదాలపై సమగ్ర అధ్యయనం చేసి కారణాలను విశ్లేషించగా.. ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అధ్యయన నివేదికను ‘ఈనాడు’ సేకరించింది.

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారం

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ- సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ పరిశోధన మండలి(సెర్బ్‌) ఆర్థిక సహకారంతో బిట్స్‌ పిలానీ-హైదరాబాద్‌ క్యాంపస్‌కు చెందిన ఆచార్యులు పరిశోధన చేపట్టారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం సహాయ ఆచార్యులు బంధన్‌ మజుందార్‌, ప్రశాంత సాహు, ఐఐటీ-బెనారస్‌ ఆచార్యుడు అగ్నివేశ్‌ పాణి, పరిశోధక విద్యార్థి కె.సిద్ధార్థ భాగస్వాములయ్యారు. ఫలితాలు ప్రముఖ సేఫ్టీ సైన్స్‌లో ప్రచురితమయ్యాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఐదు జోన్లు ఉండగా.. 60 ఠాణాలున్నాయి. వాటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రమాదాలకు కారణాలను అంచనా వేసి, అప్రియోరి అల్గారిథమ్‌తో విశ్లేషించారు. తదనుగుణంగా పరిష్కారాలు సూచించారు.

ఒకరు లేదా అంతకంటే ఎక్కువ చనిపోతున్న ఘటనలు 13.2 శాతం
గాయాలతో బయటపడుతున్నవి 86.8 శాతం


8వ స్థానం

2019లో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని నగరాల్లో జరిగే ప్రమాదాల్లో హైదరాబాద్‌ది 8వ స్థానం. ఘోర ప్రమాదాల్లో 24వ స్థానం, ఇతరత్రా ప్రమాదాల్లో 9వ స్థానం.


ప్రమాదాల నియంత్రణకు సహకారం
బంధన్‌ మజుందార్‌, సహాయ ఆచార్యుడు, బిట్స్‌ పిలానీ

2015-19 మధ్య జరిగిన ప్రమాదాల సమాచారం సేకరించి విశ్లేషించాం. ఆరు ప్రమాద కారకాలు గుర్తించాం. జిగ్‌జాగ్‌ బ్యారికేడ్లు, ట్రాఫిక్‌ ఐలాండ్స్‌ అభివృద్ధి, పోలీసు సిబ్బంది పర్యవేక్షణ, పెలికాన్‌, ట్రాఫిక్‌ సిగ్నళ్ల ఏర్పాటుతో ప్రమాదాల నియంత్రణకు పోలీసులు చక్కటి కృషి చేస్తున్నారు.


కేటగిరీలవారీగా

అత్యధిక ప్రమాద కారకాలు: భారీ వాహనాలు, గుర్తు తెలియని వాహనాలు. పాదచారులు, నిదానంగా వెళ్లే వాహనదారులు బాధితులవుతున్నారు.

ఇలా చేయాలి: రద్దీ సమయాల్లో నిదానంగా వెళ్లే వాహనాలు, భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించాలి. భారీ వాహనదారులకు నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన, శిక్షణ కల్పించాలి. అధికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బందిని కేటాయిస్తే రాత్రుళ్లు జరిగే ప్రమాదాలు తగ్గించవచ్చు. పాదచారులు, సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులు రిఫ్లెక్షన్‌ సాధనాలు వినియోగించాలి.


అత్యధిక ప్రమాద కారకాలు: రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 3 వరకు జరిగే ప్రమాదాలు.  

ఇలా చేయాలి: ట్రాఫిక్‌ కూడళ్ల సంఖ్య పెంచాలి. రాత్రుళ్లు రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్స్‌, వంతెనలు, సొరంగాలు ఏర్పాటు చేయాలి. వీధి దీపాలు వెలిగేలా చూడటంతోపాటు వాహనాలకు గ్లేర్‌ స్క్రీన్లు అమర్చాలి. ఫోకస్‌ లైట్ల వినియోగంపై వాహనదారుల్లో అవగాహన కల్పించాలి.


అత్యధిక ప్రమాద కారకాలు: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు వాహనదారులపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపుతున్నాయి.

ఇలా చేయాలి: వాహనదారుల కోసం రోడ్ల పక్కన తాగునీటి వసతి, పచ్చదనం పెంచేలా మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి.


అత్యధిక ప్రమాద కారకాలు: మధ్యాహ్నం 12 నుంచి సాయత్రం 6 వరకు, అర్ధరాత్రి 3 నుంచి ఉదయం 6 వరకు, త్రిచక్ర వాహనాలు.

ఇలా చేయాలి: ఆయా వేళల్లో వాహనాల వేగం తగ్గించేలా చర్యలు ఉండాలి.


అత్యధిక ప్రమాద కారకాలు: వర్షాకాలం, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 6 నుంచి 9 వరకు, ద్విచక్ర వాహనదారులు, నాలుగు చక్రాల వాహనాలు.

ఇలా చేయాలి: అధిక వేగం, ఓవర్‌ టేకింగ్‌, అపసవ్య దిశలో ప్రయాణించకుండా చూడాలి. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించేలా చూడాలి. తల్లిదండ్రుల్లోనూ అవగాహన తీసుకురావాలి.


అత్యధిక ప్రమాద కారకాలు: శరధృతువు, వసంత రుతువు, శీతాకాలం, ఉదయం 6-9 గంటల మధ్య, త్రిచక్ర వాహనాలు కేటగిరీలోకి వస్తాయి. భారీ వాహనదారులు, గుర్తు తెలియని వాహనదారులు బాధితులవుతున్నారు. ఈ గ్రూపులోని వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని