logo

ఇక మన యూనివర్సిటీ.. మన ఉస్మానియా

‘మన ఊరు.. మన బడి’ తరహాలో ‘మన యూనివర్సిటీ.. మన ఉస్మానియా’ పేరుతో వర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌ తెలిపారు.

Published : 22 May 2022 04:30 IST

విలేకరుల సమావేశంలో ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌


మాట్లాడుతున్న వీసీ రవీందర్‌, వేదికపై శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్‌, మల్లేశం, స్టీవెన్‌సన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘మన ఊరు.. మన బడి’ తరహాలో ‘మన యూనివర్సిటీ.. మన ఉస్మానియా’ పేరుతో వర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు ఓయూ ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌ తెలిపారు. ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టి ఈనెల 24కు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం ఆయన బేగంపేటలోని హరితప్లాజాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీసీగా బాధ్యతలు చేపట్టాక 21 అంశాల అజెండాతో ముందుకొచ్చానని, అన్ని అంశాలను పట్టా లెక్కించినట్లు చెప్పారు. వర్సిటీకి దాదాపు రూ.200 కోట్ల నిధులు తీసుకొస్తామన్నారు. త్వరలో ఆక్సిజన్‌ పార్కు, బయోడైవర్సిటీ పార్కు, సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగుల భద్రత కోసం ‘షీ’ సెంటర్‌ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇండో పసిఫిక్‌ అధ్యయన కేంద్రం ఏర్పాటుచేశామని, వచ్చేనెలలో మంత్రి కేటీఆర్‌ తో ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. విద్యార్థులలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఫెస్టివల్‌ ఆఫ్‌ ఐడియాస్‌ పేరిటకార్యక్రమం తీసుకొస్తామన్నారు.

విద్యార్థి మండలి ఏర్పాటు

విద్యార్థులు, పాలనా యంత్రాంగం మధ్య అనుసంధానం కోసం విశ్వవిద్యాలయ విద్యార్థి మండలి ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఖేలో ఇండియా కింద రూ.13కోట్లు రాగా.. సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం జరుగుతోందని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రూ.100కోట్లతో ప్రాంగణంలో పచ్చదనాన్ని మెరుగు పరుచనున్నారు.


రాష్ట్ర వర్సిటీల అభిప్రాయం తీసుకోకుండా రుద్దుతారా!

జాతీయ విద్యా విధానం అమల్లో ఎన్నో ఇబ్బందులున్నాయని వీసీ చెప్పారు. రాష్ట్ర వర్సిటీల అభిప్రాయం తీసుకోకుండా రుద్దడంతో సమస్యలు ఎదురవుతాయని ఇప్పటికే యూజీసీకి చెప్పినట్టు తెలిపారు. ఎన్‌ఈపీలోని చాలా అంశాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, చర్చ జరగాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్‌, యూజీసీ డీన్‌ జి.మల్లేశం, మీడియా సలహాదారు స్టీవెన్‌సన్‌, పీఆర్వో సి.శ్రీనివాసులు, తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని