logo
Updated : 22 May 2022 05:46 IST

పేగుల్ని పిండేసే అల్లం వెల్లుల్లి పేస్ట్‌

నిషేధిత రసాయనాలను గుర్తించిన జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో అల్లం-వెల్లుల్లి ముద్ద పెద్దఎత్తున కల్తీ అవుతోంది. కుళ్లిన అల్లం, వెల్లుల్లి, బంగాళా దుంపలు, అరటికాయ గుజ్జు, యాసిడ్‌ వంటి ద్రావణాలు, నిషేధిత టెట్రాజెన్‌ సింథటిక్‌ రంగులతో ఈ మిశ్రమం తయారు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆహార కల్తీ నియంత్రణ విభాగం తనిఖీల్లో ఈ విషయం స్పష్టమైంది. సేకరించిన నమూనాలను రాష్ట్ర ఆరోగ్య ప్రయోగశాలలో పరీక్షించగా.. నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా అల్లం-వెల్లుల్లి మిశ్రమం తయారవుతున్నట్లు తేలింది. ఈ నివేదికలను ‘ఈనాడు’ పరిశీలించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రకరకాలుగా వ్యాపారం

ఉరుకులు పరుగుల జీవితం గడిపే నగరంలో తయారు చేసిన ఆహార పదార్థాలకు డిమాండ్‌ పెరిగింది. అల్లం-వెల్లుల్లి ముద్ద అలాంటిదే. బ్రహ్మచారులతోపాటు గృహిణులూ బజార్లో డబ్బాల్లో పెట్టి విక్రయించే మిశ్రమాన్ని కొనుగోలు చేస్తుంటారు. అదే అదనుగా.. కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద లభించే కుళ్లిన అల్లం, వెల్లుల్లి, పనికిరాని ఆలుగడ్డలు, అరటి గుజ్జు మిశ్రమాన్ని తయారీకి ఉపయోగిస్తున్నారు. ఆ మిశ్రమానికి ఉప్పు, యాసిడ్‌ ద్రావణాలను ఇష్టమొచ్చినట్లు కలుపుతున్నారు. దాని వల్ల మిశ్రమంతో తయారైన వంటలను తిన్నప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్టు రుచి నాలుకపై తిష్ఠ వేస్తుంది. మసాలా దినుసులను మించి వాసనను వెదజల్లుతుంది. అలాంటి మిశ్రమాన్ని ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. పాతబస్తీలోని జల్‌పల్లి, రాజేంద్రనగర్‌, పహాడీషరీఫ్‌ తదితర ప్రాంతాల్లో వీటి తయారీ కర్మాగారాలు నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలపై దాడులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నమూనాల్లో గుర్తింపు.. బల్దియా ఆహార కల్తీ నియంత్రణాధికారులు రెండు నెలలుగా దుకాణాల్లో సోదాలు చేస్తున్నారు. అల్లం-వెల్లుల్లి మిశ్రమం డబ్బాలనూ తనిఖీలకు పంపారు. ప్రయోగశాల నివేదికలను ‘ఈనాడు’ పరిశీలించగా.. ప్రజాదరణ ఉన్న బ్రాండ్ల పేర్లను కొద్దిగా మార్చి నకిలీ రాయుళ్లు కొత్త బ్రాండ్‌తో డబ్బాలు తయారు చేస్తున్నారు. అందులో కల్తీ మిశ్రమాన్ని నింపి.. మార్కెట్లో అతి తక్కువ ధరకు అమ్ముతున్నారు. 50 నమూనాల్లో 13 అలాంటివే. ధన్యవాద్‌ సద్గురు, ఏ1 సవేరా, నేషనల్‌, సోని పేర్లతో విక్రయిస్తున్న మిశ్రమం అనారోగ్యకరమని పరీక్షల్లో తేలింది.

ఎర్రగడ్డ రైతుబజారులో శనివారం నాటి ధర(కిలో)

అల్లం: రూ.48

వెల్లుల్లి: రూ.60

కల్తీ చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద ఐదు కిలోల డబ్బా ధర: రూ.150

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts