logo

Hyd News: కట్టుకున్నది కన్నుమూసినా.. కాటికి పంపలేని దీనావస్థ

అనారోగ్యంతో భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందితే ఇంటికి తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు.. వెంట ఇద్దరు చిన్నారులు.. ఏం చేయాలో తెలియక కలిసిన వారందరినీ సాయం అడుగుతున్న దీనస్థితి అతనిది.

Updated : 22 May 2022 06:47 IST
గాంధీ ఆసుపత్రిలో భర్త యాచన
స్పందించి ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ
అంబులెన్సులో తండ్రి, పిల్లలను తీసుకెళ్తున్న శ్రీనివాస్‌

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: అనారోగ్యంతో భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందితే ఇంటికి తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు.. వెంట ఇద్దరు చిన్నారులు.. ఏం చేయాలో తెలియక కలిసిన వారందరినీ సాయం అడుగుతున్న దీనస్థితి అతనిది. విషయం తెలిసి ఓ స్వచ్ఛంద సంస్థ ఆసరాగా నిలిచింది. అంత్యక్రియలు నిర్వహించి, పిల్లలను ఆశ్రమంలో చేర్పించి ఉదారత చాటుకుంది. సికింద్రాబాద్‌ గాంధీఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

నాగర్‌కర్నూల్‌కు చెందిన నాగరాజు, బాలమ్మ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. బాలమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. స్థానికుల చొరవతో పిల్లలతో సహా భార్యను గాంధీఆసుపత్రిలో అడ్మిట్‌ చేశాడు. చికిత్స పొందుతూ ఆమె ఈనెల 18న మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు చేతిలో డబ్బులు లేక ఆసుపత్రి ఆవరణలో అందరినీ యాచించసాగాడు. ఈ విషయం తెలిసిన నగరంలో అనాథ శవాలను మార్చురీలకు తరలించే సేవలందిస్తున్న రియల్‌ వివేక్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు శ్రీనివాస్‌ ఆసుపత్రిలో నాగరాజును కలిశాడు. సొంతూరిలో అయినవారు ఎవరూ లేరని, అక్కడికి వెళ్లేందుకు డబ్బుల్లేవని తెలిసి, అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించి, పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించి చదివించడంతోపాటు, అతనికి ఉపాధి కల్పిస్తామని చెప్పడంతో నాగరాజు అంగీకరించాడు. అదేరోజు అల్వాల్‌లో బాలమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్‌లోని కరుణామయ అనాథాశ్రమంలో పిల్లలను చేర్పించారు.

పిల్లల్ని ఆశ్రమంలో చేర్పించాం: శ్రీనివాస్‌

పిల్లల చదువు కోసం ఆశ్రమంలో చేర్పించామని, నాగరాజుకు సైతం అక్కడే ఉపాధి కల్పిస్తామని ఆశ్రమ నిర్వాహకులు చెప్పారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని