logo
Updated : 22 May 2022 06:25 IST

దేవతలారా దిగిరండి.. భూములు రక్షించుకోండి

మాయమవుతున్న దేవాదాయ భూముల దస్త్రాలు


నార్సింగిలో ఆంజనేయస్వామి దేవాలయం భూమి

రాజధానిలో దేవాలయాల భూములకు రక్షణ కరవైంది...అదను దొరికితే ఆక్రమణలకు కబ్జాసురులు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో దేవుడి భూములు ఎక్కడున్నాయో.. హద్దుల్ని తేల్చే నిజాం కాలం నాటి పత్రాలు పూర్తిగా దొరక్కపోవడం కలకలం రేపుతోంది.  

రక్షించాలంటూ ఆదేశం.. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధి గండిపేట మండలం నార్సింగి పరిధిలోని 500 ఏళ్ల క్రితం నిర్మించిన పోచారం గుట్ట ఆంజనేయ స్వామి ఆలయ భూములు వివాదంలో చిక్కుకున్నాయి. ఈ దేవాలయానికి సంబంధించిన రూ.6.8 ఎకరాల భూమి ఉండగా.. ఓ రియాల్టీ సంస్థకు చెందినవారు ఈ నెల 12న తెల్లవారుజామున అక్రమంగా ప్రవేశించి చదును చేస్తున్నారని గుర్తించిన కొందరు అడ్డుకోవడంతో వివాదం రేగింది. కోకాపేటకు సమీపంలో ఉండటంతో ఆ భూముల విలువ కోట్లలో ఉంది.

* సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి సంబంధించిన భోలక్‌పూర్‌ సర్వే నంబర్‌-92లో సుమారు రూ.12కోట్ల విలువైన 1.34 ఎకరాల భూమి ఉన్నట్టు నిజాం కాలం నాటి పత్రాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన రికార్డులు మాయమైనట్లు లోకాయుక్తలో కేసు నమోదు అవడం ద్వారా బహిర్గతమైంది. అసలు అది దేవాదాయశాఖ భూమి కాదని, పొరపాటున ముంతకబ్‌లోకి వచ్చిందంటూ తేల్చి ఆ విషయాన్ని అధికారులు పక్కన పెట్టారు.
పాత రికార్డులే ఆధారం.. పూర్వకాలంలో జాగీర్దాలు, పాలకులు, సాధారణ వ్యక్తులు దేవాలయాలకు పెద్దమొత్తంలో భూముల్ని విరాళంగా ఇచ్చారు. వాటి వివరాలను నిజాం పాలకులు ప్రత్యేకంగా నమోదు చేయించి భద్రపరిచారు. ఆ రికార్డులు దొరక్కపోవడంతో ఏదైనా సమస్య వస్తే అటు రెవెన్యూ రికార్డుల్లో వెతుక్కోవడం, స్టేట్‌ ఆర్కైవ్స్‌లో పాత రికార్డుల కోసం పరుగెత్తటం తప్ప మరో ఆధారం లేకుండా పోయింది. జంటనగరాల్లో దాదాపు 1,400కి పైగా దేవాలయాలున్నాయి. ఇందులో ట్విన్‌సిటీస్‌ బుక్‌ ఆఫ్‌ ఎండోమెంట్‌ రికార్డులో 918 దేవాలయాలు రిజిస్టరయ్యాయి. అనంతరం మరికొన్ని దేవాలయాలను చేర్చారు. అయితే వీటికి సంబంధించిన భూముల వివరాలు ఇతర దస్త్రాల మాయంపై 2014లో లోకాయుక్త ఆదేశంతో అధికారులు దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని జల్లెడపట్టగా.. చివరకు నిజాం హయాం నాటి 2వేల దస్త్రాలు లభ్యం అయ్యాయి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts