logo

కన్నేశారు.. కబ్జా చేశారు!

ఆహ్లాదాన్ని పంచాల్సిన ఉద్యానవనాలు ఆక్రమణల చెరలో చిక్కాయి. స్థిరాస్తి వ్యాపారులు, లే అవుట్‌ యజమానులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై నగర శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్కు స్థలాలను కబళిస్తున్నారు.

Updated : 22 May 2022 06:06 IST

ఆక్రమణల చెరలో చిక్కుకున్న ఆహ్లాదం

శివారు మున్సిపాలిటీల్లో భారీగా పార్కుల ఆక్రమణ

* బోడుప్పల్‌ కార్పొరేషన్‌లోని అక్షయనగర్‌కాలనీ ఏర్పాటు సమయంలో 408 చదరపు గజాలను పార్కు కోసం కేటాయించారు. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు కుమ్మక్కై స్థలాన్ని ఆక్రమించేశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. స్థలం దాదాపుగా కనుమరుగైన పరిస్థితి. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.1.50కోట్లు ఉంటుందని అంచనా.


* శంషాబాద్‌ ఆర్టీసీ బస్టాండు వద్ద మూడున్నర దశాబ్దాల కిందట 20 ఎకరాల్లో హుడా అనుమతితో భారీ లే అవుట్‌ వేశారు. 10 వేల చదరపు గజాల స్థలాలను సామాజిక అవసరాలకు కేటాయించారు.  2 వేల చదరపు గజాల ఖాళీ స్థలంపై రియల్‌ వ్యాపారుల కన్ను పడింది. అప్పటి నేతలతో కుమ్మక్కై పార్కు స్థలాన్ని అమ్మేశారు. ప్రస్తుతం అక్కడ బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.


హ్లాదాన్ని పంచాల్సిన ఉద్యానవనాలు ఆక్రమణల చెరలో చిక్కాయి. స్థిరాస్తి వ్యాపారులు, లే అవుట్‌ యజమానులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై నగర శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్కు స్థలాలను కబళిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

* బోడుప్పల్‌, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో దాదాపు రూ.100 కోట్ల విలువైన పార్కు స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. సాయి భవాని నగర్‌లో 600 చదరపు గజాల పార్కు స్థలాన్ని కాజేసే కుట్ర జరుగుతోంది.

* వెంకటేశ్వర కాలనీలో 400 చదరపు గజాల స్థలాన్ని స్థానిక నాయకుడు తన కబంధహస్తాల్లోకి తీసుకున్నాడు.

* పీర్జాదిగూడలోని సాయి ఐశ్వర్యకాలనీలో సుమారు 4.11 ఎకరాల స్థలం ఆక్రమణల చెరలో చిక్కుకుంది. సాయిప్రియానగర్‌లో సుమారు ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన పార్కులు కనుమరుగవుతున్నాయి.

* చెంగిచర్లరోడ్డులో 800 వందల చదరపు గజాల పార్కు స్థలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు.

* మేడిపల్లి కమలానగర్‌ కాలనీలో 600 చదరపు గజాల స్థలాన్ని మాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

* పీ అండ్‌ టీ కాలనీలో సుమారు 1000 చదరపు గజాల పార్కు స్థలాన్ని ఆక్రమణదారులు మాయం చేశారు.

* శంషాబాద్‌లోని సీఎస్‌కే, నక్షత్ర, సాయివిహార్‌, బాలాజీ, బృందావనం గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఖాళీ స్థలాలు దస్త్రాలకే పరిమితమయ్యాయి.

* నిజాంపేట కార్పొరేషన్‌ ప్రగతినగర్‌లోని సర్వే నం.154, 155లో మూడు పార్కులున్నాయి. దాదాపు ఎకరాలో విస్తరించిన పార్కులను ఓ బడా స్థిరాస్తి వ్యాపారి తన ఆధీనంలో పెట్టుకున్నాడు.

* ప్రగతినగర్‌ పంచాయతీగా ఉన్నప్పుడు 52 పార్కులుండగా.. 16చోట్ల కనుమరుగయ్యాయి.

* పోచారంలో 75 ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్‌రిజిస్ట్రార్లకు లేఖ రాసినా.. ప్రయోజనం లేకపోయింది.

యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు..  శివారు ప్రాంతాల్లో 22 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. మూడున్నరేళ్ల కిందట వీటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల పరిధిలో ఉన్న స్థలాలను తిరిగి మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలి. పట్టణాలుగా మారిన తర్వాత అధికారులు పట్టించుకోలేదు. పార్కు స్థలాలను గుర్తించి మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యం వల్ల ఆక్రమణలకు గురయ్యాయి. పాత పంచాయతీల అనుమతులను చూపించి  విక్రయాలు చేపట్టారు. భారీ భవంతులు నిర్మించారు. మణికొండ మున్సిపాలిటీలో ఏకంగా ఐదంతస్తుల భవనాలు వెలిశాయి. వాస్తవానికి ఆయా స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆ శాఖాధికారులు నిషేధించారు. మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌ శాఖాధికారుల మధ్య సమన్వయం కొరవడి పార్కు స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, బోడుప్పల్‌, శంషాబాద్‌, నిజాంపేట, ఘట్‌కేసర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని