logo
Updated : 23 May 2022 01:23 IST

పేరుకే ఈ-నామ్‌.. పత్తాలేని ఆచరణ

అమల్లోకి వచ్చి ఆరేళ్లు

రైతులకు ఒనగూరని ప్రయోజనం

న్యూస్‌టుడే, తాండూరు

తాండూరు వ్యవసాయ విపణి

జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం (ఈ-నామ్‌) అమలైతే రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. దేశ వ్యాప్త విపణులతో స్థానిక విపణులు ఇంకా అను సంధానం కాలేదు. దీంతో రైతులు తెచ్చిన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల ట్రేడర్లు కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా పోతోంది. ఫలితంగా స్థానిక వ్యాపారులు కొనుగోలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ధరలు లభించడం లేదు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఈ-నామ్‌ పద్ధతిలో కొనుగోలుకు పోటీ పడితే రైతులకు ఎక్కువ ధర లభించి ఆర్థికంగా అధిక లాభం వీలు కలుగుతుంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

2016లో ప్రారంభం: జిల్లాలో 2016 ఏప్రిల్‌ 14 నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ-నామ్‌ను అమల్లోకి తెచ్చింది. మొదటగా రోజువారీ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగే స్పెషల్‌ గ్రేడ్‌ (ప్రత్యేక శ్రేణి) తాండూరులో దీన్ని ప్రారంభించింది. తర్వాత గ్రేడ్‌-1 పరిధిలో ఉన్న వికారాబాద్‌, గ్రేడ్‌-2 పరిధిలో ఉన్న పరిగి విపణుల్లో అమల్లోకి వచ్చింది. కమీషన్‌ ఏజెంట్లు, ట్రేడర్లకు ఈ-నామ్‌ను ఎలా వినియోగించాలనే విషయంలో ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించారు. విపణుల సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. విగణితల్లో ఉత్పత్తుల క్రయ, విక్రయాలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇందు కోసం విపణులలోనే కేబిన్‌లను ఏర్పాటు చేసి కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇందుకోసం తాండూరులో రూ.40 లక్షలను కేంద్రమే మంజూరు చేసింది. వికారాబాద్‌, పరిగిలోను అవసరం మేరకు నిధులను మంజూరు చేసింది.

కనిపించని ఉత్పత్తుల చిత్రాలు, వీడియోలు

రైతులు విక్రయానికి తెచ్చిన ఉత్పత్తులను సిబ్బంది చిత్రాలు, వీడియోలు తీసి విగణితల్లోనే అంతర్జాలానికి అప్‌లోడ్‌ చేయాలి. వ్యాపారులు ఉత్పత్తులకు సంబంధించిన చిత్రాలను విగణితల్లో చూసి బిడ్డింగులో పోటీ పడతారు. తద్వారా ఆశించిన దానికంటే రైతులకు ధర ఎక్కువగా లభించేందుకు అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలోని విపణులు జాతీయ వ్యవసాయ విపణులకు అనుసంధానమే కాలేదు కాబట్టి ఆప్రక్రియను నిర్వహించడం లేదు.

జాడలేని గ్రేడింగ్‌ ప్రక్రియ

ఈ- నామ్‌ అమల్లో ఉంటే విపణి సిబ్బంది రైతులు తెచ్చిన ఉత్పత్తులను ప్రత్యేకంగా గ్రేడింగ్‌ చేసి విక్రయానికి ఉంచుతారు. దీంతో నాణ్యంగా ఉన్న ఉత్పత్తులు, నాసిరకంగా ఉన్న ఉత్పత్తులు తెలిసి పోతాయి కాబట్టి ఆమేరకు ధరలు పలుకుతాయి. ప్రస్తుతం విపణిల్లో గ్రేడింగ్‌ పద్ధతి లేకపోవడంతో వ్యాపారులే నాణ్యతా ప్రమాణాలను నిర్ణయించి ఇష్టమొచ్చిన ధరలను నిర్ణయించి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.

జిల్లా, రాష్ట్రంలో కూడా సరిగ్గా లేదు

కనీసం జిల్లా, రాష్ట్రంలోని ఇతర విపణిలకు కూడా అనుసంధాన ప్రక్రియ సరిగ్గా జరగలేదు. కేవలం స్థానిక ట్రేడర్లు మాత్రమే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి బిడ్డింగులో పాల్గొంటున్నారు. అందరూ పరిచయస్తులే కావడంతో ఏ ట్రేడర్‌ ఎంత మేరకు ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే విషయాన్ని ముందే చర్చించుకుని బిడ్డింగ్‌కు వెళుతున్నారు. ఈ-నామ్‌ అమల్లో ఉంటే నేరుగా ఇతర రాష్ట్రాల వ్యాపారులే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు కాబట్టి ఎక్కువ ధర లభిస్తుంది. దేశ వ్యాప్తంగా వివిధ రకాల ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్‌ ఉన్నపుడు మాత్రం స్థానిక ట్రేడర్లు మద్దతుకు మించిన ధరతో కొనుగోలు చేసి రైతులను సంతృప్తి పరుస్తున్నారు.

వానాకాల పంటల విక్రయాలకు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తాం

- రాజేశ్వరి, వ్యవసాయ విపణి కార్యదర్శి, తాండూరు

తాండూరు విపణిలో వచ్చే వానాకాలం సీజన్‌ పంటల కొనుగోళ్లకు ఈ-నామ్‌ను దేశ వ్యాప్త విపణులతో అనుసంధానిస్తాం. ఈ మేరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలనే ప్రణాళికతో ఉన్నాం. ఇది విజయవంతమైతే రైతుల ఉత్పత్తుల విక్రయాలకు అదే విధానాన్ని అమలు చేస్తాం. ఈ ప్రతిపాదనను త్వరలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చాలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులదే తుది నిర్ణయం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని