logo

ఆర్డరిస్తే ఆన్‌‘లైన్‌’ కడతాయ్‌!

మొదట కొత్తదనం.. తర్వాత వ్యాపకం.. ఇప్పుడేమో పొదుపు.. నగరంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఇస్తున్న కొనుగోలుదారుల్లో వచ్చిన మార్పు ఇది. కొవిడ్‌ భయాలు తగ్గి బయట మార్కెట్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఖర్చు దృష్ట్యా ఇంటి నుంచి కాలు

Updated : 23 May 2022 05:07 IST

తెరపై తాకితే తలుపు తడుతున్న వస్తువులు

ఖర్చులు కలిసొస్తున్నాయంటున్న నగరవాసులు

ఈనాడు, హైదరాబాద్‌

మొదట కొత్తదనం.. తర్వాత వ్యాపకం.. ఇప్పుడేమో పొదుపు.. నగరంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఇస్తున్న కొనుగోలుదారుల్లో వచ్చిన మార్పు ఇది. కొవిడ్‌ భయాలు తగ్గి బయట మార్కెట్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఖర్చు దృష్ట్యా ఇంటి నుంచి కాలు కదపకుండానే సకలం గడప వద్ద వాలిపోయే సేవల వైపు నగరవాసులు మొగ్గుచూపుతున్నారు. పాలు, ఫలహారం మొదలు.. కూరగాయలు, పండ్లు, కిరాణా సరకులు, మందులు, మాంసాహారం, విందు భోజనం వరకు మొబైల్‌పై తాకితే చాలు ఇంటి తలుపు తడుతున్నాయ్‌.

కొవిడ్‌ తీవ్రంగా భయపెట్టిన గత రెండేళ్లలో ఇ-కామర్స్‌ లావాదేవీలు నగరంలో అమాంతం పెరిగాయి. సమయం కలిసి వస్తుండటం, ఒక వస్తువు కోసం పలు మార్కెట్లు తిరిగే పనిలేకుండా.. చరవాణిలోనే వెతికి ఆర్డర్‌ ఇచ్చే అవకాశం ఉండటం వంటి సానుకూలతలను కొనుగోలుదారులు గమనించారు. దాన్నే ఇప్పుడూ కొనసాగిస్తున్నారు.

ఆదివారం వచ్చిందంటే..

నగరంలో మాంసాహారం వినియోగం ఎక్కువ. ఆదివారం వచ్చిందంటే మాంసం దుకాణాల ముంగిట క్యూలు ఉండేవి. ఇప్పుడు గతంలోలా క్యూలు ఉండడంలేదు. కాలు బయటపెట్టకుండానే లూసియస్‌, టెండర్‌కట్‌, ఫిపోలా.. ఇలాంటి ఆన్‌లైన్‌ సాధనాల ద్వారా ఇంటికే మాంసాన్ని తెప్పించుకుంటున్నారు.

నిత్యావసరాలకు...

నెలవారీ నిత్యావసరాలకు ఆన్‌లైన్‌లోనూ పెద్ద సంఖ్యలో ఆర్డర్‌ ఇస్తున్నారు. నగరంలో వంద వరకు చిన్న, పెద్ద సూపర్‌మార్కెట్లు ఇంటికే సరకులను చేరవేస్తున్నాయి. బిల్లింగ్‌ కోసం అరగంటపాటు ఎదురుచూడాల్సి వస్తుండటంతో కొనుగోలుదారులు ఆన్‌లైన్‌కు మొగ్గుచూపుతున్నారు. బిగ్‌ బాస్కెట్‌, డూన్‌జో, రిలయన్స్‌ మార్ట్‌తో పాటు మరిన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సరేసరి. పిల్లలకు, పెద్దలకు దుస్తుల కోసం స్నాప్‌డీల్‌తో పాటు మరెన్నో యాప్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. కొన్ని సంస్థలు క్విక్‌ సర్వీస్‌ను ప్రారంభించాయి.

వినోదం

ప్రస్తుతం సినిమాలు చూసేందుకు కుటుంబ సమేతంగా ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. పెరిగిన టిక్కెట్ల, ఇంధన ధరల నేపథ్యంలో ఇళ్లలోనే తక్కువ ఖర్చుతో చూసేస్తున్నారు. కుటుంబంతో షికారుకు బయటకు వెళ్లాల్సి వస్తే పార్కుల వైపు మొగ్గుచూపుతున్నారు.

పెట్టుబడులు

కొవిడ్‌ సమయంలో స్థిరాస్తితోపాటు కొత్తతరం ఎక్కువగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఇదివరకైతే స్టాక్‌ బ్రోకింగ్‌ కార్యాలయాల వరకు వెళ్లి డీమ్యాట్‌ ఖాతా తెరిచి అక్కడి సిబ్బంది ద్వారా షేర్ల లావాదేవీలు నిర్వహించేవారు. గ్రో వంటి యాప్స్‌ అందుబాటులోకి వచ్చాక ఇంట్లో చరవాణిలోనే క్రయవిక్రయాలు చేసేస్తున్నారు.

రుచుల వేట..

ఆన్‌లైన్‌ ఆర్డర్లలో ఫుడ్‌ డెలివరీ వాటానే అధికం. ఉదయం ఫలహారం మొదలు బిర్యానీ, కబాబ్‌ల వరకు ఆర్డర్ల పరంపర అర్ధరాత్రి దాటాక కొనసాగుతోంది. ఇఫ్తార్‌ సమయంలో స్విగ్గీ ఆర్డర్లను విశ్లేషించగా.. ఏప్రిల్‌ 2 నుంచి 22వ తేదీ మధ్యలో సాయంత్రం 5-7 గంటల మధ్యనే 4.50 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఆన్‌లైన్‌ కోసమే ప్రత్యేకంగా క్లౌడ్‌ కిచెన్‌లు ఏర్పాటయ్యాయి.

పోటీ పరీక్షలకు

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను ఇస్తోంది. సాధారణంగా కోచింగ్‌ సెంటర్లు ఉండే అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అమీర్‌పేట వంటి కేంద్రాలు కిటకిటలాడుతుండేవి. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నా.. అంతకంటే ఎక్కువ మంది ఇంటి నుంచే ఆన్‌లైన్లోనే శిక్షణ పొందుతున్నారు. ప్రముఖ కోచింగ్‌ సెంటర్లన్నీ ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. టీవీలో టీశాట్‌ పాఠాలు బోధిస్తోంది. పుస్తకాలను సైతం అమెజాన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారు. ఇ-కామర్స్‌తో అత్యధిక మంది ఉపాధి పొందుతుండటం విశేషం.

ఆన్‌లైన్‌ ఆర్డర్లపై సర్వేల ఫలితాలు

సౌకర్యం, ఎంపికకు అవకాశం 39%

24% ఫోన్‌లో ఆర్డర్‌తో స్థానిక రిటైల్‌ షాపుల నుంచి తెప్పించుకుంటున్నాం

25% ఆదా చేసే సొమ్ముతో ఎక్కువ వస్తువులు కొనొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు