logo

రోడ్డుపై రోడ్డు..దోపిడీకేది అడ్డు!

రహదారుల నిర్మాణం.. సంపాదనకు మార్గంగా మారుతోంది. బాగున్న రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేయడం, రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బల్దియాకు అలవాటుగా మారింది.

Published : 23 May 2022 02:32 IST

నిధుల మేతగా మారిన రహదారుల నిర్మాణం

పద్మారావునగర్‌లో ఇటీవల సీసీ రోడ్డుపై వేస్తున్న తారు రోడ్డు

ఈనాడు, హైదరాబాద్‌: రహదారుల నిర్మాణం.. సంపాదనకు మార్గంగా మారుతోంది. బాగున్న రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేయడం, రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బల్దియాకు అలవాటుగా మారింది. ఏడేళ్లలో రోడ్లపై వెచ్చించే ఖర్చు రూ.700 కోట్ల మేర పెరగడం అందుకు నిదర్శనం. ఇటీవల ఈ వ్యవహారం మరింత తీవ్రరూపు దాల్చింది. ఏడాది, రెండేళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లపై స్థానిక ఇంజినీర్లు తారు రోడ్లు నిర్మిస్తున్నారు. వేసిన రెండేళ్లకే ప్రైవేటు నిర్వహణలోని ప్రధాన రహదారులపై తారు పోస్తున్నారు. సమస్యలు లేకపోయినా బల్దియా ఇంజినీర్లు నిర్మాణానికి అనుమతిస్తుండడం గమనార్హం.

ఇదిగో ఉదాహరణ

పద్మారావునగర్‌ నుంచి చిలకలగూడ వెళ్లే రోడ్డుపై శనివారం సంత నిర్వహించే ప్రాంతంలో రెండేళ్ల క్రితం సీసీ రోడ్డు వేశారు. కాలనీ రోడ్లనూ అలాగే నిర్మించారు. రెండ్రోజుల క్రితం ఆ రోడ్డుపై తారు పోశారు. అదేంటని స్థానికులు అడిగితే.. రోడ్లను అన్ని వేళలా సాఫీగా ఉంచాలన్న లక్ష్యంతో వేస్తున్నామని ఇంజినీర్లు చెప్పడం విమర్శలకు తావిచ్చింది. సీసీ రోడ్డును నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తే.. 20 ఏళ్లపాటు మన్నికగా ఉంటుంది. జీహెచ్‌ఎంసీలో ఎలాంటి రోడ్లయినా రెండేళ్లకే మరమ్మతులకు వస్తుండడం గమనార్హం.

పెరుగుతోన్న నిధుల భారం

జీహెచ్‌ఎంసీలో గతంలో రెండు రకాల రోడ్లుండేవి. 250 కి.మీ. రోడ్లను అప్పట్లో మేజర్‌గా పరిగణించి, వాటి నిర్వహణను ఆర్‌అండ్‌బీకి అప్పగించింది. మిగిలిన 9 వేల కి.మీ. రహదారుల నిర్వహణకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.330 కోట్ల మేర ఖర్చవడం గమనార్హం. ఇప్పుడు ఆర్‌అండ్‌బీ పరిధిలోనివన్నీ జీహెచ్‌ఎంసీలో కలిశాయి. ఆ విధంగానూ బల్దియాపై ఖర్చు పెరిగింది. మొత్తం రహదారులపై జీహెచ్‌ఎంసీ చేస్తోన్న ఖర్చు ఏటా పెరుగుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.833 కోట్లు ఖర్చయితే, 2021-22లో రూ.1071.16 కోట్లు ఖర్చయింది.


ఒక లైను కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు

తారు రోడ్డు(40ఎంఎం మందం) రూ.12.5 లక్షలు

సీసీ రోడ్డు రూ.26లక్షలు

వైట్‌టాపింగ్‌ రోడ్డు రూ.55లక్షలు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని