logo

కోట్లు కుమ్మరిస్తున్నా.. కంపు పోవడం లేదు!

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ ఒకప్పుడు తాగునీటి తటాకం. మానవ తప్పిదాలతో చివరికి అది కాలుష్య కాసారంగా మారిపోయింది. నగరవాసులు ఆహ్లాదం కోసం సాగర్‌

Published : 23 May 2022 02:32 IST

ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వెచ్చింపు

వ్యర్థాలు పేరుకుపోయిన హుస్సేన్‌సాగర్‌ జలాలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ ఒకప్పుడు తాగునీటి తటాకం. మానవ తప్పిదాలతో చివరికి అది కాలుష్య కాసారంగా మారిపోయింది. నగరవాసులు ఆహ్లాదం కోసం సాగర్‌ పక్కకు వెళితే ఆ కంపు భరించలేనిదిగా ఉంటోంది. దీని ప్రక్షాళన కోసం ఎప్పుటికప్పుడు ప్రణాళికలు రూపొందించడం తప్ఫ. ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. హుస్సేన్‌సాగర్‌లోకి ప్రధానంగా బంజారా, పికెట్‌, కూకట్‌పల్లి, బుల్కాపూర్‌ నాలాల నుంచి వరద వస్తుంది. ప్రస్తుతం వాటిల్లో ప్రవహించే మురుగంతా వచ్చి నేరుగా సాగర్‌లో కలుస్తోంది. దీన్ని నివారించడానికి గతంలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ రూ.370 కోట్లు వెచ్చించింది. కూకట్‌పల్లి నాలా మినహా మిగతా నాలాల్లో ముఖద్వారం వద్ద పేరుకున్న చెత్త తొలగింపుతోపాటు.. హుస్సేన్‌సాగర్‌లో మురుగు కలవకుండా నాలాలను మళ్లించేందుకు చర్యలు తీసుకుంది. అంతేకాక వ్యర్థాలు చేరకుండా అన్ని నాలాలపైనా ఇంట్రప్షన్‌ అండ్‌ డైవర్సన్‌(ఐఅండ్‌డీ) నిర్మాణాలనూ చేపట్టింది. తాజాగా రూ.6 కోట్లు వెచ్చించి విదేశాల నుంచి చెత్త వెలికితీసే యంత్రాల(ట్రాస్‌ కలక్టర్లు)ను తెప్పించింది. అయినా హుస్సేన్‌సాగర్‌ కాలుష్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని నిపుణులు చెబుతున్నారు. రూ.కోట్లు నిధులు హుస్సేన్‌సాగర్‌లో పోయడం తప్ఫ..పనుల్లో చిత్తశుద్ధి కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాలుష్యానికి ప్రధాన కారణాలివీ..

* హుస్సేన్‌సాగర్‌లో కలిసే బంజారా, పికెట్‌, బుల్కాపూర్‌ నాలాల్లో పేరుకుపోయిన పూడికను గతంలో తొలగించారు. కూకట్‌పల్లి నాలా గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ నాలా ద్వారా పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు వచ్చి కలుస్తున్నాయి. సంబంధిత వ్యర్థాల్లో.. పాదరసం, క్రోమియం, మెగ్నీషియం లాంటి రసాయనాలు ఉంటాయని అధికారులు అంచనాకు వచ్చారు. వీటిని అలాగే వదిలేయడంతో సాగర్‌ ప్రక్షాళన అంపూర్తిగానే ముగిసింది.

* కూకట్‌పల్లి నాలాను పూర్తిగా డైవర్షన్‌ చేసేందుకు ఎగువ భాగంలో గతంలో జలమండలి రూ.50-70 కోట్లతో భారీ పైపులైన్‌ నిర్మించింది. కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చే వ్యర్థాలను సంబంధిత పైపులైన్‌ ద్వారా లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో కలిసేలా ఏర్పాట్లు చేపట్టారు. ఈ పైపులైన్‌ పూర్తయినా ప్రయోజనం దక్కలేదు.

* ఇక అన్ని నాలాలపై గతంలో హెచ్‌ఎండీఏ ఐఅండ్‌డీ నిర్మాణాలు చేపట్టింది. నాలాల నుంచి వచ్చే చెత్తాచెదారాన్ని వేరు చేయాలనే ఉద్దేశంతో వీటిని నిర్మించారు. ఆనక కరెంటు బిల్లుల భారం ఇతరత్రా కారణాలతో వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. రోజుకు 24 గంటలపాటు ఇవి పనిచేయాల్సి ఉండగా...అడపాదడపా మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో యథావిధిగా హుస్సేన్‌సాగర్‌లోకి ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. వానలు పడి వరద పోటెత్తే సమయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని