logo

నకిలీ పత్రాలతో రూ.40కోట్ల స్థలం కబ్జాయత్నం

నకిలీ పత్రాలు సృష్టించి ఒక ప్రవాస భారతీయుడికి చెందిన దాదాపు రూ.40కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వైనం వెలుగు చూసింది. బంజారాహిల్స్‌ పోలీసులు

Published : 23 May 2022 02:32 IST

16 మందిపై కేసు, అయిదుగురి అరెస్టు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలు సృష్టించి ఒక ప్రవాస భారతీయుడికి చెందిన దాదాపు రూ.40కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వైనం వెలుగు చూసింది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 13లో సర్వే నంబరు 129/40/1లో ప్రవాస భారతీయుడు, సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు న్యావనంది పూర్ణచందర్‌రావుకు 2500 గజాలకు పైగా స్థలం ఉంది. ఆయన ఆమెరికాలో ఉన్న సమయంలో రేవ ఇన్‌ఫ్రా ఎండీ బాలప్రవీణ్‌ ఈ స్థలంపై కన్నేశారు. నకిలీ దస్తావేజులతో ప్రతాప్‌ అనే వ్యక్తి పేరుతో నకిలీ ఆధార్‌ కార్డు, నకిలీ వ్యక్తులను సృష్టించాడు. ఖదిర్‌ బేగం అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పత్రాలను తయారు చేయించారు. ఈ పత్రాల ఆధారంగా తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పూర్ణచందర్‌రావు ఈ వ్యహారంపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నకిలీ పత్రాలతో స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ఖదిర్‌బేగం, ఎండీ మొయినుద్దీన్‌, పరాంకుశం సురేందర్‌, దొంతుల సుధాకర్‌బాబు, బాలప్రవీణ్‌, సింగిరెడ్డి వీరహనుమారెడ్డి, బూరుగు సత్యనారాయణగౌడ్‌, హరికృష్ణారెడ్డి, దీపక్‌దేశ్‌ముఖ్‌ తదితర 16 మందిపై ఐపీసీ సెక్షన్‌ 419, 420, 465, 467, 468, 471, రెడ్‌ విత్‌ 120బి కింద కేసు నమోదు చేశారు. సురేందర్‌, దొంతుల సుధాకర్‌, మొయినుద్దీన్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కబ్జాకు ప్రధాన సూత్రధారులైన బాలప్రవీణ్‌, ఖదీర్‌బేగం, ప్రతాప్‌లతో పాటు మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. అయితే, రోజువారీ కూలీల పేరుతో నకిలీ ఆధార్‌ కార్డులు, దస్తావేజులు సృష్టించినట్లు తమ విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 129/15 అనే సర్వే నంబరుతో కబ్జాకు యత్నించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని