logo
Published : 23 May 2022 02:32 IST

హై సెక్యూరిటీ పరేషాన్‌!

రవాణా శాఖ కార్యాలయాల్లో కుప్పలుగా నంబరు ప్లేట్లు

మేడ్చల్‌ ఆర్టీఏ కార్యాలయంలో భారీగా నిల్వ ఉన్న హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ రిజిస్ట్రేషన్లు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల్ని వేగంగా గుర్తించడం సహా ఎన్నో భద్రతా ప్రమాణాలతో అమల్లోకి తెచ్చిన హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) వినియోగం మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. కనీసం నంబరు ప్లేటు తీసుకోవడానికి ముందుకురాక.. రవాణా శాఖ కార్యాలయాల్లో వందల సంఖ్యలో పడి ఉంటున్నాయి. 2019 ఏప్రిల్‌ నుంచి వాహన డీలర్ల వద్దే హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్లు బిగించే విధానం ప్రారంభమైంది. అంతకు ముందున్న విధానంలో రవాణా శాఖ కార్యాలయాల్లోనే వీటిని అమర్చేవారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక ప్లేటు సిద్ధమైనట్లు వాహనదారుడి సెల్‌ఫోన్‌కు సందేశం వచ్చేది. అనంతరం దాన్ని అమర్చేవారు. ఈ ప్రక్రియలో జాప్యం అవ్వడం, కొందరికి సందేశాలు అందకపోవడం, పర్యవేక్షణ లోపంతో వేలాది మంది వీటిని తీసుకోవడం లేదు.

అధికారుల ఉదాసీనతే... రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ తప్పనిసరి. అధికారుల ఉదాసీన వైఖరితో వాహనదారులు పాటించడం లేదు. హెచ్‌ఎస్‌ఆర్‌పీపై ఉండే అక్షరాలు, సంఖ్యల్ని మార్చేందుకు వీలుపడదు. ప్లేటు తుప్పుపట్టదు. త్వరగా దెబ్బతినదు. ట్యాంపర్‌ చేసేందుకు అవకాశం లేకుండా తయారవుతుంది. వాహన యజమానులు తమకు నచ్చిన ఆకృతిలో అంకెలు, అక్షరాలు ముద్రించేందుకు వీలుండదన్న ఉద్దేశంతో వీటిని వినియోగించడం లేదు. ఉదాహరణకు ఒక వాహనానికి టీఎస్‌ 08 6066 నంబరు కేటాయిస్తే.. యజమాని మాత్రం సున్నాను చిన్నగా.. ఆరును పెద్దగా 666 వచ్చేలా రాసుకుంటారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులకు రిజిస్ట్రేషన్‌ నంబర్లను గుర్తించడం సమస్యగా మారుతోంది. వివిధ చోరీలు, హత్య కేసుల్లో నిందితులను పట్టుకున్నప్పుడు వారు నకిలీ రిజిస్ట్రేషన్‌తో వాహనాల్ని వినియోగించినట్లు గుర్తించారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఉంటే వీటికి కొంత అడ్డుకట్ట పడుతుందని స్పష్టమైనా క్షేత్రస్థాయిలో అమలవ్వడం లేదు.

వాహనాన్ని సీజ్‌ చేయొచ్చు

* కేంద్ర మోటారు వాహన చట్టం ప్రకారం 2013 డిసెంబరు తర్వాత రిజిస్ట్రేషన్‌ అయిన వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేటు తప్పనిసరి.

* వాహనానికి బిగించకపోతే ట్రాఫిక్‌ పోలీసులు రూ.200 నుంచి రూ.1200 వరకూ చలానా విధించవచ్ఛు

* ఉద్దేశపూర్వకంగా రిజిస్ట్రేషన్‌ నంబరు కనిపించకుండా చేస్తే ఛీటింగ్‌ కేసు నమోదు చేసి సీజ్‌ చేసే అధికారముంది.

* వాహనాన్ని ఇతరులకు విక్రయించాలన్నా.. రిజిస్ట్రేషన్‌ బదిలీ, బీమా పునరుద్ధరణ, ఫిట్‌నెస్‌ ధ్రువీకరణను నిలిపేస్తారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని