logo

రూ.కోట్లు వ్యయం... పథకం అలంకారప్రాయం

కాగ్నానదిలో పుష్కలంగా నీరున్నా.. సాగుకు వాడుకోలేని దుస్థితి. రూ.కోట్లు ఖర్చు చేసి బాగు చేసిన ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారుల అలసత్వం... సాగునీటి సంఘం ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు.

Published : 24 May 2022 00:46 IST

 నవాంద్గీ ఎత్తిపోతలకు నిర్వహణ లోపం  
 అధికారులు, సాగునీటి సంఘం సభ్యుల అలసత్వం  
న్యూస్‌టుడే, బషీరాబాద్‌

కాగ్నానదిలో పుష్కలంగా నీరున్నా.. సాగుకు వాడుకోలేని దుస్థితి. రూ.కోట్లు ఖర్చు చేసి బాగు చేసిన ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారుల అలసత్వం... సాగునీటి సంఘం ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఎకరా పొలానికి కూడా నీరు పారించుకోలేకపోతున్నారు. అన్నీ బాగానే ఉన్నా.. నిర్వహణకు వీలుకాక నేలను తడిపే తోవ లేకుండా పోయిందని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదైనా అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

బాగు చేసి మూడేళ్లు...

ఎత్తిపోతల పథకం మోటార్లు, ఇతర సామగ్రి పాడవడంతో మూడేళ్ల క్రితం అప్పటి సాగునీటి శాఖ మంత్రి రూ.1.29 కోట్లు విడుదల చేశారు. కొత్త మోటర్లు, విద్యుత్‌ పరికరాలు, ఎత్తిపోతల బావికి నీరొచ్చేలా గొట్టపు సొరంగం ఏర్పాటు చేసి అంతా బాగు చేశారు. పొలాలకు నీరు పారించేందుకు ట్రయల్‌ రన్‌ సైతం నిర్వహించారు. నీళ్లు పుష్కలంగా బయటికి వచ్చాయి. త్వరలో ప్రారంభిస్తాం.. అంటూ అధికారులు చెప్పి వెళ్లిపోయారే తప్ప మళ్లీ మొహం చూడలేదని రైతులు పేర్కొంటున్నారు. తమకు ప్రారంభించుకోవాలని అధికారులు చెప్పలేదని సాగునీటి సంఘం ప్రతినిధులు వివరిస్తున్నారు. మరికొన్ని రోజులైతే బిగించిన మోటర్లు, సామగ్రి మూలకు చేరే ప్రమాదం ఉందని..ఈసారైనా పునరుద్ధరణ చేయాలని రైతులు కోరుతున్నారు.

చేతినిండా పనే...

పథకం బాగున్నప్పుడు ఆయకట్టు రైతులకు నీరందడంతో ఏడాదిలో రెండు పంటలు సాగు చేసుకునేవారు. ప్రస్తుతం పడావుగా మారడంతో బీడుగా మారి రైతులు కూలీలుగా మారారు. ఈ ఏడాది నీరందిస్తే చేతినిండా పని ఉంటుందని వివరిస్తున్నారు. వరి, వేరుసెనగ  పంటలకు ఈ నేలలు అనువైనవి. ప్రతి సీజనులో ఒక్కో రైతు ఎకరాకు వరి 30 బస్తాలు, వేరుసెనగ 35 బస్తాల వరకు పండించేవారు. పొలానికి నీరు చేరి మళ్లీ పాత రోజులు రావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.

* పథకం పేరు: నవాంద్గీ ఎత్తిపోతల (బషీరాబాద్‌), 1974లో నిర్మాణం.

* లక్ష్యం: 550 ఎకరాలకు సాగునీరందించడం. 

* ఎందుకు ఆగింది: మోటర్లు పాడవడం, ఎత్తిపోతల బావికి ఇసుక మేటలు పేరుకుపోవడం.

* ప్రస్తుత స్థితి: రూ.1.29 కోట్ల వ్యయంతో అంతా బాగు చేశారు.

* ఇప్పుడేం చేయాలి: అధికారులు, సాగునీటి సంఘం ప్రతినిధులు చొరవ చూపాలి.

మరో రూ.8లక్షలు మంజూరు...

ఎత్తిపోతల కాల్వలు బాగు చేయాలనే రైతుల కోరిక మేరకు ఇటీవల సాగునీటి శాఖ రూ.8 లక్షలు మంజూరు చేసింది. కుడి, ఎడమ కాల్వలను బాగు చేస్తే వృథా కాకుండా రైతుల పొలాలకు చక్కగా పారతాయి. గుత్తేదారుకు పనులు సైతం అప్పగించారు. ఈ వేసవిలోనే కాల్వలను బాగు చేయిస్తే వానా కాలం సీజను నాటికి నీరు పారించుకోవచ్చని రైతులు వివరిస్తున్నారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటేనే ఈసారి పథకం ప్రారంభమై బీడు భూములు పచ్చని పొలాలుగా మారతాయి. 

ఇస్తే పంటలు పండిస్తాం: నర్సింహులు, ఆయకట్టు రైతు, నవాంద్గీ

ఎత్తిపోతల పథకం కింద నాకు రెండెకరాల పొలం ఉంది. ఈసారి నీరొస్తుందని భావించాను. పథకాన్ని ప్రారంభించకపోవడంతో భూమి పడావుగా మారింది. అంతా బాగైంది. నీటిని అందించడమే ఉందని అధికారులు చెప్పారు. మూడేళ్లు దాటినా ఎవరూ స్పందించడం లేదు. ఈ వానాకాలంలోనైనా నీరందిస్తే వరి సాగు చేసుకుంటాం. 

పనులన్నీ పూర్తయ్యాయి: సాయి, నీటి పారుదల శాఖ ఏఈ, బషీరాబాద్‌

ఎత్తిపోతల పనులు పూర్తయ్యాయి. ఉన్నతాధికారులకు వివరించి ఆయకట్టు రైతులు, సాగునీటి సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రైతులకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే వానాకాలం సీజనులో పంటల సాగయ్యేలా కార్యాచరణ చేపడతాం. ఎత్తిపోతల బావి, కాల్వలను బాగు చేయించేందుకు కూడా యత్నిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని