logo

పాతబస్తీ మెట్రోకు మరోసారి మదింపు

నగరంలోని పాతబస్తీ వరకు మెట్రోరైలు పనులను పూర్తిచేసేందుకు అవసరమైన భూసేకరణపై అధికారులు మరోసారి మదింపు చేపట్టారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మార్గంలో సేకరించాల్సిన ఆస్తులకు సంబంధించి

Published : 24 May 2022 01:50 IST

పెరగనున్న భూసేకరణ వ్యయం!

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీ వరకు మెట్రోరైలు పనులను పూర్తిచేసేందుకు అవసరమైన భూసేకరణపై అధికారులు మరోసారి మదింపు చేపట్టారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మార్గంలో సేకరించాల్సిన ఆస్తులకు సంబంధించి గతంలోనే మార్కింగ్‌ వేసినా.. మరోసారి పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే యాభై శాతం పూర్తయిందని మెట్రో అధికారులు అంటున్నారు. స్థానికంగా దాదాపు వెయ్యి వరకు ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు అప్పట్లోనే రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం భూముల మార్కెట్‌ విలువల పెంపుతో ప్రాజెక్టు వ్యయం మరో యాభై శాతం పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
మెట్రోరైలు తొలిదశలో కారిడార్‌-2ని జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ తమ నిధులతో ఈ పనులు పూర్తిచేయాలనేది ఒప్పందం. పనులు మొదలైనప్పటి నుంచి.. పాతబస్తీ మీదుగా మెట్రో వెళితే ప్రార్థనా స్థలాలు తొలగించాల్సి వస్తుందని అలైన్‌మెంట్‌ మార్చాలని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని మెట్రో అధికారులను ఆదేశించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాక మొదట ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌నే మళ్లీ ఖరారు చేశారు. ఆ తర్వాత కూడా అభ్యంతరాలు వచ్చాయి. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడం.. మరోవైపు మిగతా మార్గాల్లో మెట్రో పనులు పూర్తికావడం.. జాప్యంతో నిర్మాణ వ్యయం పెరగడంతో పాతబస్తీ పనుల నుంచి ఎల్‌ అండ్‌ టీ మెట్రో వైదొలిగింది. ఆనక ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా పనుల్లో అడుగు కూడా ముందుకు పడలేదు.

బడ్జెట్‌లో నిధులతో ఆశలు..

2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం పాతబస్తీ మెట్రోరైలు మార్గానికి రూ.500 కోట్లు ప్రతిపాదించింది. దీంతో సంబంధిత ప్రాజెక్టులో కదలిక వచ్చింది. పాతబస్తీలో మెట్రో వెళ్లే మార్గంలో భూగర్భంలో తవ్వకుండానే పైపులు, ఇతరత్రా ఏమున్నాయో గుర్తించే ప్రక్రియను మొదలెట్టారు. దీనికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు.  


ఎంత అవుతుంది?

పాతబస్తీ 5.5 కి.మీ. మార్గాన్ని ఒప్పందం ప్రకారం ఎల్‌ అండ్‌ టీ సంస్థనే చేపట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అయితే, ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే లోపే.. కరోనా వ్యాప్తి, అనంతరం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో వాయిదా పడింది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, పాతబస్తీ వరకు మెట్రో పూర్తి చేయాలంటే రూ.1,500 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని