logo

ప్రజా రవాణా.. సెలవు రోజుల్లో హైరానా

సెలవు రోజుల్లో నగరంలో ప్రజారవాణా ఒకింత కష్టతరమవుతోంది. ప్రధాన వనరులైన ఆర్టీసీ, రైల్వేలు వారాంతాల్లో సర్వీసులను బాగా తగ్గిస్తుండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా శని, ఆదివారాల్లో నగరంలో ప్రజారవాణా పడకేస్తోంది. ఆదివారం

Published : 24 May 2022 02:06 IST

 సిటీ బస్సులు డిపోలకే పరిమితం

ఈనాడు, హైదరాబాద్‌: సెలవు రోజుల్లో నగరంలో ప్రజారవాణా ఒకింత కష్టతరమవుతోంది. ప్రధాన వనరులైన ఆర్టీసీ, రైల్వేలు వారాంతాల్లో సర్వీసులను బాగా తగ్గిస్తుండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా శని, ఆదివారాల్లో నగరంలో ప్రజారవాణా పడకేస్తోంది. ఆదివారం ప్రైవేటు సంస్థలకు, నిత్యం ప్రజల సేవలో ఉండే విభాగాలకు సెలవు ఉండదు. ఫంక్షన్లు, పర్యటనలు ఎక్కువ జరుగుతుంటాయి. కుటుంబ సమేతంగా హాజరవ్వాలనుకొనే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు రవాణా ఖర్చు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.
సగం తగ్గించారు.. సమయపాలనేదీ!
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఎంఎంటీఎస్‌ సేవలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. గతంలో రోజుకు 121 సర్వీసులతో 1.80 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేవి ఎంఎంటీఎస్‌లు. కరోనా తర్వాత అందులో సగం మంది కూడా వినియోగించుకోవడంలేదని ద.మ. రైల్వే చెబుతోంది. సాధారణ రోజుల్లో 76 సర్వీసులను నడుపుతుండగా.. శని, ఆదివారాల్లో 34కు కుదించేసింది. ఆ మేరకు నడిపే సర్వీసుల సమయాల సమాచారాన్ని ముందస్తుగా రైల్వే స్టేషన్లలో ప్రదర్శింపజేస్తే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. ఎంఎంటీఎస్‌ల సమయపాలన అస్తవ్యస్తంగా మారింది.
ప్రకటించకుండానే నిలిపేస్తున్న ఆర్టీసీ
టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ప్రకటన చేయకుండానే.. సెలవు రోజుల్లో సిటీ బస్సులను తగ్గించేస్తోంది. ప్రధాన రహదారుల్లో 20శాతం సర్వీసులను, రద్దీ లేని మార్గాల్లో 30-40 శాతం సర్వీసులను అనధికారికంగా రద్దు చేస్తోంది. డిపోలవారీగా లెక్కలేసి మరీ సర్వీసులపై కోత విధిస్తోంది. నగరంలో 2019లో 3850 సిటీ బస్సులుండగా.. ప్రస్తుతం వెయ్యి అధికారికంగా తగ్గించేశారు. ఈ రెండేళ్లలో 300 వరకు తుక్కుగా మారాయి. మొత్తం మీద 1300 బస్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం తిరిగే 2550 బస్సుల్లో శని, ఆదివారాల్లో 1800 మాత్రమే తిప్పుతుండడంతో సామాన్య ప్రయాణికులు అగచాట్లు పడాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని