logo

‘భర్త, కౌన్సిలర్‌ నాపై దాడి చేశారు..’

తన భర్త మొహ్మద్‌ హఫీజ్‌తో పాటు శంషాబాద్‌ పురపాలిక 4వ వార్డు కౌన్సిలర్‌ జహంగీర్‌(తెరాస) తనపై దాడిచేశారని జల్‌పల్లి పురపాలిక వాది ఎ ముస్తఫాకు చెందిన ఉమేరా బేగం(33) ‘న్యూస్‌టుడే’ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. వివాహమై

Published : 24 May 2022 02:06 IST

గాయపడ్డ మహిళ ఉమేరాబేగం

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: తన భర్త మొహ్మద్‌ హఫీజ్‌తో పాటు శంషాబాద్‌ పురపాలిక 4వ వార్డు కౌన్సిలర్‌ జహంగీర్‌(తెరాస) తనపై దాడిచేశారని జల్‌పల్లి పురపాలిక వాది ఎ ముస్తఫాకు చెందిన ఉమేరా బేగం(33) ‘న్యూస్‌టుడే’ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. వివాహమై 20ఏళ్లు గడిచి నలుగురు సంతానం ఉన్నా... ఇటీవల తనను భర్త హఫీజ్‌ అనుమానిస్తూ వేధిస్తున్నాడని ఆరోపించింది. ఇటీవల పెద్ద కూతురు పెళ్లి చేశామని తెలిపింది. ఆపై తనను ఇంట్లో క్షణం కూడా ఉండవద్దని రంజాన్‌ మాసం తొలిరోజే భర్త తనను ఇంటినుంచి వెళ్లగొట్టాడని తెలిపింది. నాటినుంచి పిల్లలను పోషించేందుకు తల్లి సాబెరాబేగంతో కలిసి జల్‌పల్లిలో ఉంటున్నట్లు తెలిపింది. కూతురు పెళ్లికి తాకట్టు పెట్టిన ఇంటి విషయం, తనతో కలిసి ఉంటానని కోరేందుకు ఆదివారం తన తమ్ముడు హాజిని తీసుకుని ఉమేరాబేగం శంషాబాద్‌లోని భర్త హఫీజ్‌ ఇంటికి వెళ్లింది. ఇల్లు తాకట్టు పెట్టలేదని, కౌన్సిలర్‌కు విక్రయించానని భర్త తెలిపాడు. ఆమె పెట్టిన సంతకం విక్రయ పత్రాలపైనేనని స్పష్టం చేయడంతో వాగ్వాదం నెలకొంది. తమ్ముడి కళ్లముందే భర్త తనను కర్రతో తీవ్రంగా కొట్టాడని తెలిపింది. ఆపై అతను కౌన్సిలర్‌ జహంగీర్‌ను రప్పించాడని వివరించింది. ఆయన రాగానే.. ఆనాడే ఇల్లు నాకు విక్రయించారు కదా మళ్లీ ఎందుకొచ్చారంటూ హాజీపై చేయిచేసుకున్నాడని ఉమేరా బేగం ఆరోపించింది. విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడని ఆమె ‘న్యూస్‌టుడే’ ముందు ఆవేదన వ్యక్తం చేసింది.

వీధిలో గొడవ చేస్తున్నందుకే..

‘మా వీధిలో భర్తతో గొడవ పడుతూ పెద్దగా కేకలు వేస్తోందని వచ్చాను. ఈ సందర్భంగా ఉమేరాబేగంపైనా, ఆమె తమ్ముడిపై చేయిచేసుకున్నాన’ అని శంషాబాద్‌ కౌన్సిలర్‌ జహంగీర్‌ ‘న్యూస్‌టుడే’తో అన్నారు. ఆ ఇంటిని తానే నిర్మించి నిరుపేదలని ఐదేళ్ల క్రితం వారికి ఇచ్చానన్నారు. ఇల్లు అమ్ముతానంటే వద్దన్నాను.. ఆమె భర్త కోరడంతో తిరిగి కొనుగోలు చేశానన్నారు. తరువాతా గొడవ చేస్తుండటంతో ఆగ్రహం పట్టలేక దాడి చేయాల్సి వచ్చిందన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని