logo

అక్రమ నిర్మాణదారులకు జలక్

రాజధాని, శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. అనుమతుల్లేని అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు ఇకపై రిజిస్ట్రేషన్లు చేయొద్దని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఆదేశించింది. అక్రమ లేఅవుట్లలోని స్థలాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాజధాని పరిధిలో దాదాపు లక్ష ఫ్లాట్లు,

Published : 24 May 2022 03:09 IST

 లక్ష ఫ్లాట్లు, వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేత

 సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాజధాని, శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. అనుమతుల్లేని అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు ఇకపై రిజిస్ట్రేషన్లు చేయొద్దని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఆదేశించింది. అక్రమ లేఅవుట్లలోని స్థలాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాజధాని పరిధిలో దాదాపు లక్ష ఫ్లాట్లు, వేలాది స్థలాల(ప్లాట్ల) రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
అక్రమ లేఅవుట్లలోని స్థలాలను, అక్రమంగా వెలసిన అపార్టుమెంట్లలోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల కిందట ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటివి రాజధానిలో లక్ష ఫ్లాట్లు ఉంటాయని అంచనా వేశారు. ఒక్క నిజాంపేటలోనే 1200 అపార్ట్‌మెంట్లను రెండేళ్ల కిందట సీజ్‌ చేశారు. వీటిలో 15,000 ఫ్లాట్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు నిలిపేయడంతో ఫ్లాట్ల యజమానులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. డాక్యుమెంట్‌పై అనుమతి లేని నిర్మాణమని పేర్కొని, వారందరికీ రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్లు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. 5 వేల మంది ఇలా లబ్ధిపొందారు. తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అక్రమ నిర్మాణాల్లో రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ సుప్రీంకోర్టు 4 రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదేశాలివ్వడంతో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ నిలిచిపోయింది.

ఉల్లంఘిస్తే వేటే

దుండిగల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, జీడిమెట్ల, బండ్లగూడ జాగీర్‌ తదితర వందలాది ప్రాంతాల్లో బిల్డర్లు రెండంతస్తులకు అనుమతులు తీసుకుని అయిదారు అంతస్తులు వేశారు. రిజిస్ట్రేషన్‌ అధికారులకు అంతోఇంతో ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ పర్వానికి బ్రేకు పడింది. కొద్ది రోజుల కిందట దుండిగల్‌లో అక్రమ నిర్మాణాలపై ‘ఈనాడు’ వరుస కథనాలు ఇవ్వడంతో దాదాపు 210 అపార్టుమెంట్లను అక్రమంగా నిర్మించారని గుర్తించి పాక్షికంగా కూల్చివేశారు. తరువాత పట్టించుకోకపోవడంతో కొన్నింటిని తిరిగి నిర్మించారు. నిజాంపేటలోనూ అలాగే జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఇకపై ఒక్క అక్రమ ఫ్లాటు రిజిస్ట్రేషన్‌ చేసినా సంబంధిత అధికారులపై వేటు వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.


కడితే  కూల్చేస్తారు

హెచ్‌ఎండీఏ పరిధిలోని వేలాది అక్రమ లేఅవుట్లలో సుమారు లక్షన్నర ఖాళీ స్థలాలను రియల్టర్లు విక్రయించారు. తాజాగా 111 జీవో పరిధిలోని గ్రామాల వద్ద వందలాది లేఅవుట్లు వెలిశాయి. కొనుగోలుకు అడ్వాన్సులు ఇస్తున్నారు. అక్రమ లేఅవుట్లలో స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖను ఆదేశించింది. వాటిల్లోని నిర్మాణాలను కూల్చివేయాలని స్పష్టం చేసింది.

* అనుమతుల్లేని అపార్టుమెంట్లలో నిర్మించిన ఫ్లాట్లు: లక్ష

* అక్రమ లేఅవుట్లలోని స్థలాలు: 1.50  లక్షలు

* హైకోర్టు ఆదేశాలతో రిజిస్టర్‌ అయిన ఫ్లాట్స్‌: 5000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని