Malla Reddy: రేవంత్‌ నన్ను మామూలుగా బ్లాక్‌ మెయిల్‌ చేయలేదు: మంత్రి మల్లారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను అడుగడునా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను

Updated : 24 May 2022 14:54 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను అడుగడుగునా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు రేవంత్‌ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి విరుచుకుపడ్డారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం కోసం భూములు కొన్న విషయం వాస్తవమే అయినా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. తెదేపాలో ఉన్ననాటి నుంచి రేవంత్‌ తనను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేశారని తీవ్ర విమర్శలు చేశారు.

‘‘రేవంత్‌రెడ్డి నన్ను మామూలు బ్లాక్‌ మెయిల్‌ చేయలేదు. తెదేపాలో ఉన్నప్పుడు మల్కాజ్‌గిరి ఎంపీ సీటు రాకుండా చేసేందుకు రేవంత్‌ చాలా ప్రయత్నించారు. ఒకే పార్టీలో ఉన్నా ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఎంతో బాధ పడ్డా. రేవంత్‌ కుమార్తె పెళ్లి ఎవరి డబ్బుతో జరిగింది? ఆ పెళ్లికి నా డబ్బే ఇచ్చాను. దీనిపై యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిపై ప్రమాణానికి రేవంత్‌ సిద్ధమా? నేను ప్రభుత్వ భూమి, అసైన్డ్‌ భూమి కొనలేదు. నా యూనివర్సిటీ కోసం మార్కెట్‌ రేటు కంటే నాలుగింతలు ఖర్చు చేసి కొన్నా. భూమి కొనడం తప్పా?కాంగ్రెస్‌, భాజపా వాళ్లు కొనడం లేదా? రేవంత్‌ ఇప్పటికీ నన్ను విడిచిపెట్టకుండా అదే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు’’ అని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని