logo

కేబుల్‌ వేయడం కంటే..అనుమతులకే భారీ వ్యయం

వానాకాలంలో సాధ్యమైనంత వరకు విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గాలివాన వచ్చినా సాఫీగా కరెంట్‌ సరఫరా చేసేందుకు శాశ్వత పరిష్కారాలకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

Updated : 25 May 2022 06:08 IST

జీహెచ్‌ఎంసీ లీజింగ్‌ ఛార్జీలు..కొత్తలైన్లకు ప్రతిబంధకం
వానాకాలం సన్నద్ధతపై ఈనాడు’తో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలంలో సాధ్యమైనంత వరకు విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గాలివాన వచ్చినా సాఫీగా కరెంట్‌ సరఫరా చేసేందుకు శాశ్వత పరిష్కారాలకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. భూగర్భ కేబుళ్లతో అంతరాయాలకు చెక్‌ పెట్టే అవకాశం ఉన్నా.. జీహెచ్‌ఎంసీ కొత్తగా లీజింగ్‌ ఛార్జీలు ప్రవేశపెట్టడం, రహదారి తవ్వకం అనుమతుల రుసుములు పెంచడం ప్రతిబంధకంగా మారిందన్నారు. ‘ఈనాడు’తో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ..
వానాకాలంలో అంతరాయాలకు శాశ్వత పరిష్కారం లేదా?
చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొడుగు ఉండే కరెంట్‌ తీగల(కవర్‌ కండక్టర్ల)ను గతంలో వేర్వేరు పథకాల కింద వేశాం. కొత్తగా కేంద్రం ప్రకటించిన ఆర్‌డీఎస్‌ పథకంలోనూ  ప్రతిపాదించాం. భూగర్భ కేబుళ్ల పరిధిని విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. రుసుములే ప్రతిబంధకంగా మారాయి. భూగర్భకేబుల్‌ వేసేందుకు అయ్యే వ్యయం కంటే రహదారుల తవ్వకానికి జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన ఫీజులే ఎక్కువ అవుతున్నాయి. మీటర్‌ రోడ్డు తవ్వకానికి గతంలో అనుమతి రుసుం రూ.2200 ఉండేది. ఇటీవల దాన్ని మరో రూ.300 పెంచారు. ఇది కాకుండా భూగర్భంలో కేబుల్‌ వేస్తున్నందుకు 25 ఏళ్లపాపాటు వర్తించేలా కొత్తగా లీజింగ్‌ ఛార్జీలు మీటర్‌కు రూ.300 వసూలు చేస్తున్నారు. దీంతో కేబుల్‌ వేసేందుకు అయ్యే ఖర్చు కంటే అనుమతుల కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దీంతో భూగర్భ కేబుల్స్‌ వేయడం కొంత తగ్గించాం. ఆర్‌డీఎస్‌ గతంలో ఈ ఛార్జీలను మినహాయిస్తే మొత్తం ప్రధాన రహదారుల వెంట భూగర్భ కేబుల్‌ వేస్తామని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాం.
నగరంలో డిమాండ్‌కు తగ్గట్లు సేవలందిస్తున్నారా?
డిస్కంకు ఆదాయపరంగా హైదరాబాద్‌ ప్రాంతం అత్యంత కీలకం. మా కొచ్చే ఆదాయంలో అత్యధికం ఇక్కడి నుంచే. సేవల్లో లోపాలు తలెత్తకుండా నిరంతరాయంగా కరెంట్‌ సరఫరా చేస్తున్నాం. హైడల్‌ విద్యుత్తు ఉత్పత్తి లేకున్నా.. పెరిగిన డిమాండ్‌కు సరిపడా కరెంట్‌ సరఫరా చేశాం.  
పాతబస్తీలో చౌర్యం కేసులు ఎందుకు తగ్గుతున్నాయి?
పాతబస్తీలో కేసులు తక్కువ ఉండటానికి పరిధి తక్కువ ఉండటమే కారణం. ఇక్కడ సైతం కేసులు నమోదు చేస్తున్నాం. ఆదాయం రావడం లేదు అనేది కూడా సరైంది కాదు. ఈనెల రూ.108 కోట్ల డిమాండ్‌ వచ్చింది. వంద శాతం వసూలు  అవుతోంది.
గాలివానతో ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
విద్యుత్తు తీగల కింద, సమీపంలో చెట్లు ఉన్న చోట గాలులకు, వానకు కొమ్మలు తాకి అంతరాయాలకు దారితీస్తున్నాయి. వీటిని నివారించేందుకు ఇప్పటికే తీగల కింద కొమ్మలు కొట్టడం పూర్తయ్యింది. గాలివానకు చెట్లు తీగలపై పడితే సత్వరం తొలగించేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసి సిబ్బందికి అందుబాటులో ఉంచాం. భారీ వృక్షాలు పడితే జీహెచ్‌ఎంసీ సాయం తీసుకుంటున్నాం.
కొత్త కనెక్షన్లకు డిమాండ్‌ పెరగడానికి కారణం?
గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకునేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు పెరిగాయి. కొవిడ్‌ తర్వాత వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వీటి ఫలితంగానే ఏడాది కాలంలోనే 6 లక్షల కొత్త కనెక్షన్లు వచ్చాయి. అందుకు తగ్గట్టే కరెంట్‌ డిమాండ్‌ సైతం పెరిగింది. టారిఫ్‌ ఛార్జీల పెంపుతో ఆ మేరకు ఆదాయమూ పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని