logo

కొకైన్‌ స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు

శివారు ప్రాంతాలైన సన్‌సిటీ, వనస్థలిపురం కేంద్రాలుగా నగరంలో కొకైన్‌ వ్యాపారాన్ని నడుపుతోన్న ఒక ఆఫ్రికన్‌తో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌, ధూల్‌పేట ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 56 గ్రాముల కొకైన్‌తో

Published : 25 May 2022 02:45 IST

56 గ్రాములు స్వాధీనం

పట్టుకున్న కొకైన్‌, చిత్రంలో ఈఎస్‌ విజయ్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ కరుణ, ధూల్‌పేట సీఐ బాలగంగాధర్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే : శివారు ప్రాంతాలైన సన్‌సిటీ, వనస్థలిపురం కేంద్రాలుగా నగరంలో కొకైన్‌ వ్యాపారాన్ని నడుపుతోన్న ఒక ఆఫ్రికన్‌తో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌, ధూల్‌పేట ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 56 గ్రాముల కొకైన్‌తో పాటు రూ.1.28 లక్షల నగదు, ఇన్నోవా కారు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ కరుణ, ధూల్‌పేట ఎక్సైజ్‌ సీఐ బాలగంగాధర్‌తో కలిసి హైదరాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ విజయ్‌ వివరాలను వెల్లడించారు. ఘనా దేశానికి చెందిన ఆఫ్రికన్‌ మౌరీస్‌(31) ఫార్మసీ విద్యార్థి వీసాతో భారత్‌కు వచ్చి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు సోమవారం రాత్రి పురానాపూల్‌ సమీపంలోని ధరతీమాతా ఆలయం వద్ద మాసబ్‌ట్యాంక్‌ నివాసి సందీప్‌ షా(37)ను అదుపులోకి తీసుకొని అతని ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా ఏడు గ్రాముల కొకైన్‌ రూ.36 వేల నగదు లభ్యమైంది. అతణ్ని విచారించగా అప్పుడే అతనికి కొకైన్‌ సరఫరా చేసి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్రికన్‌ మౌరిస్‌ను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారిస్తే కొకైన్‌ స్మగ్లింగ్‌ ముఠా గుట్టు బయటపడింది. పంజాగుట్టలో ఇటీవలే కొకైన్‌ కేసులో పట్టుబడిన చార్మినార్‌ ప్రాంత వాసి, ఏపీ ప్రొడక్ట్స్‌ అధినేత యజ్ఞానంద్‌కు పదకొండు గ్రాముల కొకైన్‌ను అతని డ్రైవరు లియాకత్‌ అలీ(30)కి ఇచ్చి ఇన్నోవా కారులో పంపించినట్లు మౌరిస్‌ తెలపడంతో.. అప్రమత్తమైన ఎక్సైజ్‌ పోలీసులు కారును మార్గమధ్యలో పట్టుకొని డ్రైవరు దగ్గర ఉన్న 11 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారి అయిన మౌరిస్‌ ఇంటిపై దాడి చేసి మరో 38 గ్రాముల కొకైన్‌ను, నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి 56 గ్రాముల కొకైన్‌ను, రూ.1.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈఎస్‌ సీహెచ్‌ విజయ్‌ తెలిపారు. ఈ కొకైన్‌ను కాఫీ పొడి ప్యాకెట్ల రూపంలో ప్రత్యేకంగా తయారు చేసి, ఒక్కో ప్యాకెట్‌లో గ్రాము చొప్పున నింపుతారు. అనంతరం ఒక్కో ప్యాకెట్‌ను రూ.5 వేల నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా వ్యవహారంపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన యజ్ఞానంద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని