logo

బషీర్‌బాగ్‌ పీజీ న్యాయ కళాశాల తరలింపు!

123 సంవత్సరాల చరిత్ర కలిగిన బషీర్‌బాగ్‌లోని పీజీ న్యాయ కళాశాలను బషీర్‌బాగ్‌ నుంచి ఎత్తివేసి వర్సిటీలోని న్యాయశాస్త్ర విభాగంలో విలీనం చేయనున్నారా..! దీనిపై రెండురోజుల కిందట  వర్సిటీ పాలకమండలి సమావేశంలో కీలక చర్చ నడిచింది.

Published : 25 May 2022 04:20 IST

ఓయూ న్యాయశాస్త్ర విభాగంలో విలీనం యోచన

ఈనాడు, హైదరాబాద్‌: 123 సంవత్సరాల చరిత్ర కలిగిన బషీర్‌బాగ్‌లోని పీజీ న్యాయ కళాశాలను బషీర్‌బాగ్‌ నుంచి ఎత్తివేసి వర్సిటీలోని న్యాయశాస్త్ర విభాగంలో విలీనం చేయనున్నారా..! దీనిపై రెండురోజుల కిందట  వర్సిటీ పాలకమండలి సమావేశంలో కీలక చర్చ నడిచింది.
ఓయూపీజీ లా కళాశాల తరగతులు 1899లో నిజాం హయాంలో ప్రారంభమయ్యాయి. వర్సిటీ కంటే ముందే న్యాయ కళాశాల ఏర్పడింది. ప్రస్తుతం బషీర్‌బాగ్‌లో కొనసాగుతోంది. కళాశాల తరఫున ఎల్‌ఎల్‌బీలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, ఎల్‌ఎల్‌ఎంలో రెగ్యులర్‌, సాయంకాల కోర్సులు అందిస్తున్నారు. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ న్యాయశాస్త్రం చదివారు. కళాశాలలో ప్రిన్సిపల్‌, మరో ఆచార్యురాలు పనిచేస్తున్నారు. మిగిలిన సిబ్బంది పార్ట్‌టైం, విజిటింగ్‌ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఇక్కడ ఆచార్యులు లేరనే సాకుతో కళాశాలను ఎత్తివేసి.. ఉస్మానియాకు తరలించే ప్రణాళిక సిద్ధం చేశారు. వాస్తవానికి రిక్రూట్‌మెంట్‌ జరగకపోడంతో పోస్టులన్నీ ఖాళీగా ఉండిపోయిన దుస్థితి. దీనిపై గతంలోనూ ప్రతిపాదన రాగా.. కొన్నాళ్లపాటు పక్కన పెట్టారు. తాజాగా పాలకమండలి సమావేశంలోనూ చర్చించారు. దీనిపై బార్‌ కౌన్సిల్‌కు లేఖ రాసి.. అనుమతి తీసుకున్న వెంటనే కళాశాలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
భవనాలు.. భూములు సంగతి..?.. ప్రస్తుతం న్యాయ కళాశాల భవనాలతో కలిసి 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. కళాశాలను వర్సిటీకి మారిస్తే ఈ భూములు, భవనాలు ఖాళీగా మారతాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


ఇంకా నిర్ణయం తీసుకోలేదు
- ప్రొ.డి.రవీందర్‌, ఉపకులపతి, ఓయూ

పీజీ న్యాయ కళాశాలలో ఇద్దరు ఆచార్యులే ఉన్నారు. విలీనంపై చర్చే తప్ప ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో తరలిస్తే భూములు, భవనాలు నిజాం కళాశాలకు వినియోగించుకోవాలని భావిస్తున్నాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని