KTR in Davos: తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో ష్నైడర్ ఎలెక్ట్రిక్ కార్యకలాపాల విస్తరణ

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్‌ వెళ్లిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆయన బృందం పర్యటన కొనసాగుతోంది. దావోస్‌ వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

Published : 25 May 2022 17:19 IST

దావోస్‌: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్‌ వెళ్లిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆయన బృందం పర్యటన కొనసాగుతోంది. దావోస్‌ వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆ మేరకు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. తాజాగా తెలంగాణలో కార్యకలాపాలు కొనాసాగిస్తోన్న ష్నైడర్ ఎలెక్ట్రిక్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించనుంచి. ఇందుకోసం రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ష్నైడర్ ఎలెక్ట్రిక్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ ఈ ప్రకటన చేశారు.

ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అడ్వాన్స్డ్‌ లైట్ హౌస్ అవార్డును పొందిందని రిమోంట్ తెలిపారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న స్నేహపూర్వక విధానాలను దృష్టిలో పెట్టుకొని తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు రిమెంట్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో రెండో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్ల చెప్పారు. కొత్త ప్లాంట్‌ నుంచి ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ఆటోమేషన్ ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు రిమోంట్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను పెట్టుబడులకు రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ష్నైడర్ ఎలెక్ట్రిక్.. తన తయారీ పరిశ్రమను విస్తరించడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ష్నైడర్ ఎలెక్ట్రిక్ అదనపు తయారీ యూనిట్‌తో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. తెలంగాణలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ష్నైడర్ ఎలెక్ట్రిక్‌ కంపెనీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని