logo

కాంట్రాక్టర్‌ వేధింపులు.. కుటుంబం ఆత్మహత్యా యత్నం!

గుత్తేదారు వేధింపులు భరించలేక సబ్‌ కాంట్రాక్టర్‌ కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. మనో వేదన అనుభవిస్తున్న తాము భరించలేక అఘాయిత్యానికి...

Updated : 26 May 2022 05:53 IST

పోలీసుల సత్వర స్పందనతో తప్పిన ప్రాణాపాయం

ఈనాడు, హైదరాబాద్‌; సరూర్‌నగర్‌, న్యూస్‌టుడే: గుత్తేదారు వేధింపులు భరించలేక సబ్‌ కాంట్రాక్టర్‌ కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. మనో వేదన అనుభవిస్తున్న తాము భరించలేక అఘాయిత్యానికి పాల్పడుతున్నామంటూ బాధితులు సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. రాచకొండ పోలీసులు సత్వరమే స్పందించి నాలుగు ప్రాణాలను కాపాడారు. బుధవారం సరూర్‌నగర్‌లోని హోటల్‌లో చోటుచేసుకున్న ఘటన వెనుక కారణాలను బాధితుడు శశికుమార్‌ సెల్ఫీవీడియో, సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. తమ ఆత్మహత్యకు దినేష్‌రెడ్డి కారణమని తెలిపాడు. తాము మరణించాక ఆ డబ్బు వసూలు చేసి తాను ఇవ్వాల్సిన వ్యక్తులకు పంచాలంటూ కొందరి వ్యక్తుల పేర్లు రాసిపెట్టాడు. సెల్ఫీ వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన చండ్ర శశికుమార్‌, శ్వేత దంపతులకు ఇద్దరు కుమారులు. శశికుమార్‌ రఘు కనస్ట్రక్షన్‌ సంస్థ స్థాపించి సబ్‌ కాంట్రాక్టులు చేస్తున్నారు. 2019లో పంజాగుట్టకు చెందిన స్పెషల్‌ కాంట్రాక్టర్‌ నుంచి కమీషన్‌ చెల్లించే అంగీకారంతో కాంట్రాక్టు పనులు చేపట్టారు. సంస్థ ఉద్యోగి ఒకరు డిపార్ట్‌మెంట్‌ వాళ్లకు ఇవ్వాలంటూ ఆయన వద్ద కొంత నగదు తీసుకున్నాడు. తన సంస్థ పేరుతో పనులు చేయించి వచ్చిన బిల్లులను ఫోర్జరీ సంతకాలతో వారే కొట్టేశారు. మూడేళ్లుగా చేసిన పనులకు బకాయిలు చెల్లించకుండా అతనిపైనే మధిర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రూ.2 కోట్ల వరకు బకాయిలను ఇవ్వకుండా దినేష్‌రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు. తిట్టి, బెదిరించాడు. మా ఆత్మహత్యలకు దినేష్‌రెడ్డి కారణం, సంబంధిత సాక్ష్యాలు చరవాణి, పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయి. బెదిరించినట్టు వాయిస్‌ రికార్డులు కూడా ఉన్నాయి. ఆధారాలను పరిశీలించి తగిన న్యాయం చేయాలి.  

ఆదుకున్న డయల్‌ 100.. ఖమ్మం నుంచి శశికుమార్‌ దంపతులు పిల్లలతో మూడురోజుల కిందట వచ్చి సరూర్‌నగర్‌లోని హోటల్‌లో బసచేశారు. ఆదివారం అతను కాంట్రాక్టర్‌ను కలిశాడు. డబ్బులు తిరిగి రావనే నిర్దారణకు వచ్చాడు. పిల్లలకు 2 చొప్పున ఇచ్చి దంపతులు 40-45 నిద్రమాత్రలు మింగారు. తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు బంధువులకు సెల్ఫీ వీడియో పంపాడు. ఖమ్మంలోని శ్వేత సోదరుడికీ వీడియో చేరడంతో డయల్‌ 100కు ఫోన్‌చేసి పోలీసులకు తెలిపాడు. స్పందించిన రాచకొండ పోలీసులు శశికుమార్‌ కుటుంబం ఉన్న హోటల్‌కు వెళ్లి దంపతులు, పిల్లల్ని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని