logo

ఒక్కరికీ రుణం ఇవ్వలేదు

ఎస్సీ, ఎస్టీ రుణాల జారీలో కార్పొరేషన్ల అధికారులు నత్తతో పోటీ పడుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇప్పటివరకూ ఒక్క లబ్ధిదారుడికి కూడా రాయితీ రుణం(సబ్సిడీ లోన్‌) ఇవ్వలేదు. కార్పొరేషన్లు ఇస్తున్నవే అరకొర అనుకుంటే..

Published : 26 May 2022 02:32 IST

ఆర్థిక సంవత్సరం ముగిసినా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అందని సబ్సిడీ లోన్లు
మూడేళ్లుగా పట్టించుకోని బీసీ కార్పొరేషన్‌
ఈనాడు- హైదరాబాద్‌

స్సీ, ఎస్టీ రుణాల జారీలో కార్పొరేషన్ల అధికారులు నత్తతో పోటీ పడుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇప్పటివరకూ ఒక్క లబ్ధిదారుడికి కూడా రాయితీ రుణం(సబ్సిడీ లోన్‌) ఇవ్వలేదు. కార్పొరేషన్లు ఇస్తున్నవే అరకొర అనుకుంటే.. ఎంపికైన వారికి చేరడానికి ఏళ్ల సమయం పడుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాల్లో గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4,400 మంది ఎస్సీ, ఎస్టీలకు లోన్లు ఇస్తామని ప్రకటించినా ఒక్కరికీ నయాపైసా విడుదల చేయలేదు.

మార్చితోనే ముగింపు..!
ఎస్సీ కార్పొరేషన్‌ 2020-21లో ఇవ్వాల్సిన రుణాలను.. 2021-22లో అమలుచేస్తోంది. అంటే రెండేళ్లకు కలిపి ఒక్కసారి ఇస్తోంది. గతేడాదికి సంబంధించి నవంబరులోపే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నా.. ఈ ఏడాది మార్చి వరకూ కొనసాగింది. ఆ తర్వాత నిధులు విడుదలవ్వాల్సి ఉన్నా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రుణాలకు ఎంపికైన వారు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఏ మాత్రం ఫలితం ఉండటం లేదు.

ఎస్టీలకు రెండో ఏడాది అంతే..!
ఎస్టీ కార్పొరేషన్‌ అధికారులు 2021-22 వార్షిక రుణ ప్రణాళిక ప్రకటించినా.. లబ్ధిదారుల్ని ఇప్పటివరకూ ఎంపిక చేయలేదు. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి. 2020-21లోనూ ఇదే తరహాలో లబ్ధిదారుల్ని ఎంపిక చేయకుండా వదిలేశారు. వరుసగా రెండో ఏడాది ఆలస్యం జరగడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాల్లేక బీసీ కార్పొరేషన్‌ 2018-19 నుంచి రుణాలు ఇవ్వడం లేదు.

నీరుగారుతున్న లక్ష్యం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా వివిధ వర్గాలకు చెందిన నిరుపేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు ఇస్తోంది. ఉదాహరణకు రూ.5 లక్షల రుణం ఇస్తే అందులో సగం రాయితీ. అంటే రుణం తీసుకున్న వ్యక్తి సగం రూ.2.5 లక్షల్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఇదెంతో ప్రయోజనం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని