logo

Hyderabad News: సహచరిణే కన్యాదాత.. అధికారులే పెళ్లి పెద్దలు

ఓ అనాథ యువతి వివాహం యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంలో బుధవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వారిని ఆశీర్వదించారు. నెల రోజుల వయసున్న పాపకు సింధూగా నామకరణం చేసి

Updated : 26 May 2022 11:08 IST


కొత్త జంటకు బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్యే గోపీనాథ్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఓ అనాథ యువతి వివాహం యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంలో బుధవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వారిని ఆశీర్వదించారు. నెల రోజుల వయసున్న పాపకు సింధూగా నామకరణం చేసి స్టేట్‌హోంలోని శిశువిహార్‌లో అధికారులు ఆశ్రయం కల్పించారు. ఐదేళ్ల వయసు రాగానే బాలసదనంలోకి మార్చారు. అక్కడే పెరిగి పెద్దయి ఇంటర్‌ పూర్తి చేసిన సింధూ(28) బేగంపేటలోని షాపర్స్‌ స్టాప్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనికి చేరింది. అక్కడ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఉపేందర్‌(30)తో అయిన పరిచయం ప్రేమకు దారితీసింది.  

స్టేట్‌హోంలోనే వేదిక: సింధూ, ఉపేందర్‌ల వివాహం కోసం స్టేట్‌హోం ఆవరణలోని హాల్‌లో పెళ్లి పందిరి వేశారు. భాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా పెళ్లి జరిపించారు. సింధుతోపాటు బాలసదనంలో పెరిగిన సరోజ, తన భర్త హరిప్రసాద్‌తో కలిసి కన్యాదానం చేసింది. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, కలెక్టర్‌ శర్మన్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌, కార్పొరేటర్‌ దేదీప్య విజయ్‌లు జంటను ఆశీర్వదించారు. స్టేట్‌హోం సిబ్బంది సొంత ఖర్చులతో పెళ్లికి, కాపురానికి కావలసిన సామగ్రి తెచ్చారు. దాతలు నాగమల్లి అనిల్‌కుమార్‌, బాల్‌రాజ్‌, జగిని శ్రీనివాస్‌ భోజనాలు ఏర్పాటుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని