logo

నాలుగు పదుల్లో నలుదిశలా యాత్రలు

కరోనా కట్టడి నుంచి కట్టలు తెంచుకుంటూ విదేశీ యాత్రలకు నగర ప్రజలు పరుగులు పెడుతున్నారు. కరోనా ఆంక్షలతో రెండేళ్లు ఇంటికే పరిమితమైనవారు.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పర్యాటక యాత్రలకు వెళుతున్నారు. అయితే

Updated : 26 May 2022 05:57 IST

నగరం నుంచి విదేశాలకు జోరుగా ప్రయాణాలు
ఈనాడు - హైదరాబాద్‌

రోనా కట్టడి నుంచి కట్టలు తెంచుకుంటూ విదేశీ యాత్రలకు నగర ప్రజలు పరుగులు పెడుతున్నారు. కరోనా ఆంక్షలతో రెండేళ్లు ఇంటికే పరిమితమైనవారు.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పర్యాటక యాత్రలకు వెళుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు పదుల వయసుకు అటు, ఇటు ఉన్నవారే ఇందులో ఎక్కువ మంది ఉన్నారని.. అంతర్జాతీయ యాత్రలు నిర్వహిస్తున్న నగర పర్యాటక సంస్థలు చెబుతున్నాయి.

40 ఏళ్ల వారే ఎందుకు..
కరోనా వేరియంట్ల వల్ల వృద్ధులు దేశం దాటడంలేదు. వెళ్లినా వారి బంధువులు, పిల్లలు ఉన్న ప్రాంతాలనే ఎంపిక చేసుకుంటున్నారు. 40 ఏళ్ల వారు ఎక్కువగా విదేశీ యాత్రలకు వెళ్తున్నారు. ఉద్యోగ, వ్యాపార లావాదేవీలతో పాటు.. యాత్రలూ చేసేస్తున్నారు. నగరంలోని ఒక అంతర్జాతీయ పర్యాటక యాత్రలు నిర్వహించిన సంస్థ మార్చి నెలారంభం నుంచి మే నెల 15వ తేదీ వరకూ 4 బృందాలను ఇలా తీసుకెళ్లినట్లు చెప్పింది. యూరోపియన్‌ దేశాలతో పాటు.. థాయ్‌లాండ్‌, స్పెయిన్‌, నార్త్‌ ఆసియా యాత్రలకు కూడా ఎక్కువ మంది వెళ్తున్నారని చెప్పింది. వంద మంది పర్యాటకుల్లో 40 ఏళ్లు ఉన్న వారు 76 శాతం ఉన్నారని ఓ సంస్థ తన సర్వేలో పేర్కొంది.

యాత్ర ఏదైనా విమానయానమే..
నగరం నుంచి రోజూ విదేశాలకు 30 విమానాలు ఎగురుతున్నాయి. వీటికి తోడు 200ల వరకూ దేశీయ విమానాలు నగరం నుంచి వివిధ పట్టణాలకు వెళ్తున్నాయి. విదేశాలకు ప్రతి రోజు 7వేల నుంచి 8 వేల మంది.. స్వదేశంలో 40 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరంతా పర్యాటకులు కానప్పటికీ.. విదేశాలకు వెళ్లే వారు తప్పనిసరిగా అక్కడ పనులు ముగించుకుని ఏదో ఒక ప్రాంతాన్ని చూసి వస్తారని పర్యాటక సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా సాహస యాత్రలు చేసేవారు కూడా 40 ఏళ్ల వయసు వారే ఎక్కువమంది ఉంటున్నారు. థాయ్‌లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, మొరాకో, స్పెయిన్‌, కోస్టారికా, జర్మనీ, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు ఎక్కువ సంఖ్యలో సాహస యాత్రలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. వీటికి తోడు యూరప్‌ దేశాల సందర్శనకు నగరవాసులు ఎక్కువ మక్కువ చూపుతున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని