logo
Published : 26 May 2022 03:13 IST

రూ.కోట్లు పెట్టినా.. నిత్యం వెతలే...

తాండూరులో విద్యుత్‌ సరఫరా అధ్వానం
న్యూస్‌టుడే, తాండూరు

జిల్లాలో ప్రధాన పట్టణంగా పేరున్న తాండూరులో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం 2018లో సమగ్ర విద్యుత్తు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) ప్రవేశపెట్టింది. దీనికింద రూ.3.5 కోట్లు వెచ్చించి పనులు చేపట్టింది. కొత్తగా నియంత్రికల ఏర్పాటు, వదులు తీగల స్థానే కొత్త తీగల ఏర్పాటు వంటి పనులు జరిగాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి గాలి, వాన వచ్చినా సరఫరాను ఆపేస్తున్నారు. గంటల తరబడి స్తంభిస్తున్న సరఫరా కారణంగా వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

రూ.3.5 కోట్లతో పనులు
తాండూరులో ప్రజలకు మెరుగైన విద్యుత్తు సరఫరా చేపట్టాలంటే ట్రాన్స్‌కో ఇంజినీర్లు రూ.7 కోట్లు వ్యయమౌతాయని 2017లో అంచనాలు రూపొందించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు వ్యయాన్ని రూ.3.5 కోట్లకు తగ్గించి రెండోసారి అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అప్పట్లో ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. టెండర్లు పిలిచి అర్హులైన గుత్తేదారుకు పనులను అప్పగించారు. కాలనీల్లో అడ్డదిడ్డంగా ఉన్న పాత స్తంభాలను తొలగించి కొత్తవి పాతారు. వీటికి 33/11 కె.వితో పాటు 11 కె.వి, ఎల్‌టీ లైన్‌లకు కొత్త తీగలను లాగారు. అన్ని కాలనీల్లో కలిపి 16 కి.మీ పొడవునా తీగలు లాగారు. వీటికి తోడు కాలనీల్లో  డిమాండ్‌ను బట్టి 100 కెవిఎ, 160 కెవిఏ, 315 కెవిఎ సామర్థ్యంతో కూడిన 50 నియంత్రికలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా పాత నియంత్రికలు అదనం. వీధుల్లోని స్తంభాలకు దీపాలు పగటి వేళ కాకుండా కేవలం రాత్రి వేళ మాత్రమే వెలిగేలా నిర్ణీత ప్రదేశాల్లో ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌లను ఏర్పాటు చేశారు. అంతా సవ్యంగా జరగడంతో ట్రాన్స్‌కో స్థానిక వినియోగ దారులకు మెరుగైన విద్యుత్తు సరఫరా అందించసాగింది.

నెలకు రూ.3 కోట్ల ఆదాయం
పట్టణంలో విద్యుత్‌ సర్వీసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పరిసర గ్రామాలకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాలనుంచి వచ్చి నివాసం ఏర్పాటుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగానికి డిమాండ్‌ అధికమైంది.  ప్రస్తుతం పట్టణంలో 50వేలకు పైబడి విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. వీటికోసం నిత్యం 8 నుంచి 10 మెగావాట్ల విద్యుత్తు వినియోగమౌతుంది. బిల్లుల రూపంలో వినియోగదారుల నుంచి ప్రతి నెల రూ.3 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. కొత్త సర్వీసుల కోసం ప్రతి రోజు 20 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. ఇందుకు తగినట్లు ఏర్పాట్లు లేక పోవడంతో నియంత్రికలు, ఫీడర్లపై భారం పెరిగి సరఫరాలో తరచూ అంతరాయాలు ఎదురౌతున్నాయి.

వేసవి నుంచి పాట్లే...
ఈ ఏడాది వేసవి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో విద్యుత్తు సరఫరా స్తంభిస్తోంది. ఏబీ స్విచ్‌ల నిర్వహణ సవ్యంగా లేదు. అక్కడక్కడా తీగలు ఒకదానికి ఒకటి తగలడంతో ఇన్సులేటర్లు కాలుతున్నాయి. నియంత్రికలు మరమ్మతుకు గురవడం వంటి సమస్యలు ఉత్పన్నమవడంతో విద్యుత్తు సరఫరా స్తంభిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. పర్యవేక్షణ లోపం. ఎప్పటికప్పుడు తనిఖీలు లేక ఇబ్బందులు పెరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.  

పట్టణంలో చిన్నపాటి గాలి, వాన వచ్చిందంటే చాలు సరఫరా ఆగిపోతోంది. ఇలాంటి సమయంలో సరఫరాకు అంతరాయం ఉండకూడదనే ఉద్దేశంతోనే రూ.3.5 కోట్లు వ్యయం చేసి పనులు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.


పరిష్కారానికి దృష్టి సారించాం
- ఆదినారాయణ, ట్రాన్స్‌ కో సహాయ డివిజనల్‌ ఇంజినీరు, తాండూరు

పట్టణంలో విద్యుత్తు సరఫరాలో తలెత్తుతున్న అంతరాయాన్ని నివారించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాం. సర్వీసుల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా నియంత్రికలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే కొత్తగా 15 నియంత్రికలను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసే పనులు చేపట్టాం. పట్టణంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూస్తాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని