logo
Published : 26 May 2022 03:13 IST

కొనుగోళ్లలో జాప్యం... కర్షకులకు కష్టం

25 శాతమైనా దాటని ధాన్యం సేకరణ  
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

పర్వతాపూర్‌లో ఇలా..

ఆరుగాలం కష్టపడి పండించిన దిగుబడుల్ని విక్రయించేందుకు అన్నదాతలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. వెరసి వందలాది మంది రైతులు కోతలు పూర్తయిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. అకాల వర్షాలకు గింజలు మొలకెత్తుతుండటంతో నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

చింతామణిపట్నంలో మొలకెత్తిన ధాన్యం గింజలు

ఎక్కడ నిల్వ చేయాలి
జిల్లాలో గతేడాది 90వేల ఎకరాల్లో సాగైన వరి ఈసారి సగానికి తగ్గింది. యాభై శాతం మంది రైతులకు పది రోజులుగా దిగుబడులు చేతికొచ్చాయి. వాటిని కొనుగోలు చేసేందుకు డీసీఎమ్‌ఎస్‌, ఐకెపీ ఆధ్వర్యంలో కేంద్రాలను ప్రారంభించి సేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వేగంగా జరగక ఇప్పటివరకు పాతిక శాతం కూడా సేకరించ లేదు. కోతలు పూర్తి చేసిన రైతులు రహదారులు, ఇళ్ల ముందు, పొలాల వద్ద కుప్పలుగా వేసి కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుండటంతో మొలకలు వస్తున్నాయి. దీంతో దిగుబడులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.  

జాబితాలో పేర్ల గల్లంతు..
సాగు సమయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పొలాలను సందర్శించి పంట, విస్తీర్ణం, సర్వే సంఖ్య వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఆయా రైతుల నుంచే ధాన్యాన్ని కొంటున్నారు. నారాయణ్‌పూర్‌లో 117మంది రైతులు 200 ఎకరాల్లో వరి సాగు చేశారు. వీరందరి వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. విషయం తెలియని రైతులు గోనూరులోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తే అధికారులు నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చింతామణిపట్నం, పర్వతాపూర్‌లోనూ పలువురి రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో కన్పించడం లేదు.  


అధికారులు స్పందించాలి
యాదప్ప, నారాయణ్‌పూర్‌

గోనూరు కేంద్రం అధికారులు వివరాలు లేవంటూ చేతులు దులిపేసుకున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లో వివరాలు లేవంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి. వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి.


గింజలు మొలకెత్తాయి
బుజ్జమ్మ, చింతామణిపట్నం.

ధాన్యాన్ని విక్రయించేందుకు తరలించాం. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో వారం రోజులుగా నిరీక్షిస్తున్నాం. ఇంటి ముందు కుప్పగా వేసిన ధాన్యం వర్షానికి తడిసి మొలకలు వచ్చాయి. నష్టాన్ని ఎవరు భరిస్తారు. 


మాకు న్యాయం చేయండి
శివరాజ్‌, పర్వతాపూర్‌

ధాన్యం విక్రయించేందుకు అధికారులను సంప్రదిస్తే వివరాలు ఆన్‌లైన్‌లో లేవంటున్నారు. అధికారులు నమోదు చేయకుంటే మమ్మల్ని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు సబబు. మాకు న్యాయం చేయండి.  


ఆందోళన వద్దు : రజిత, వ్యవసాయ అధికారిణి, తాండూరు
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఆన్‌లైన్‌లో వివరాలులేని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో సమస్య పరిష్కరింపజేస్తాం.


వ్యవసాయ అధికారులను సంప్రదించండి : విమల, జిల్లా మేనేజరు
అన్నికేంద్రాల్లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణకు ఆదేశిస్తాం. వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొంటాం. ఆన్‌లైన్‌లో పేర్లు, పంట వివరాలు ఉన్న రైతుల నుంచి కచ్చితంగా కొనుగోలు చేస్తాం. పేర్లు లేని వారు వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని