Modi: కరోనా వేళ భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది: మోదీ

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌ మరో మైలురాయిని అందుకుందని.. దేశానికే గర్వకారణంగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ

Updated : 26 May 2022 17:09 IST

హైదరాబాద్: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌ మరో మైలురాయిని అందుకుందని.. దేశానికే గర్వకారణంగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని.. ఇక్కడి విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక స్టార్టప్‌లు రూపొందించారని తెలిపారు. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 25 ఏళ్ల నాటి సంకల్పంలో ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరి ముఖ్య పాత్ర ఉందని మోదీ అన్నారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐఎస్‌బీ స్కాలర్లకు ఎక్సలెన్స్‌, లీడర్‌షిప్‌ అవార్డులు ప్రదానం చేశారు. ఐఎస్‌బీ స్కాలర్లు అభిజిత్‌, భరద్వాజ్‌, వైదేహీ, విక్రమ్‌సింగ్‌, ఉత్కర్ష్‌, ప్రదీప్‌లు మోదీ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. రాఘవ్‌ చోప్రాకు హైదరాబాద్‌ క్యాంపస్‌ ఛైర్‌పర్సన్‌ అవార్డును మోదీ అందించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.

అభివృద్ధిలో భారత్‌ పురోభివృద్ధి సాధిస్తోంది..

‘‘జీ 20 దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉంది. అంతర్జాల వినియోగదారుల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. స్టార్టప్స్‌ రూపకల్పన, వినియోగదారుల మార్కెట్‌లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. కరోనా విపత్తు వేళ భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. కొవిడ్‌ కారణంగా గొలుసు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధిలో భారత్‌ పురోభివృద్ధి సాధిస్తోంది. గత ఏడాది భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఈ ఘనతలన్నీ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. భారత్‌ సాధించిన ఘనతలో ఐఎస్‌బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఎంతో ఉంది.

విధానాలు కాగితాలకే పరిమితం కావొద్దు..

భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ప్రపంచవ్యాప్త సమస్యలకు పరిష్కార మార్గాలు భారత్‌లో లభిస్తున్నాయి. వ్యక్తిగత  లక్ష్యాలను దేశ లక్ష్యాలతో సమన్వయం చేసుకోవాలి. స్టార్టప్‌లు, సేవా రంగాల్లో యువత సత్తా చాటుతున్నారు. యువత దేశాన్ని ఏలే విధంగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. రిఫార్మ్.. పర్ఫార్మ్‌.. ట్రాన్స్‌ఫార్మ్‌.. అనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. విద్యార్థులు బయటకు వచ్చాక పాలసీ విధానాలు రూపొందిస్తారు. పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కావొద్దు. రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుంది. దేశంలో సంస్కరణల అవసరం ఎప్పుడూ ఉంటుంది. రాజకీయ కారణాలతో సంస్కరణల అమలు కష్టంగా మారింది. 3 దశాబ్దాలుగా రాజకీయ అస్థిరతతో సంస్కరణల అమలు కష్టమైంది. 2014 తర్వాత భారత్‌లో సంస్కరణలు వేగవంతం అయ్యాయి’’ అని మోదీ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని