logo

పారదు జలం.. పండదు పొలం

అటవీ ప్రాంతంలో గుట్టలపై కురిసిన వర్షం నీరు వృథాగా పోకుండా ఒడిసిపడితే బీడు భూములను పచ్చటి పొలాలుగా మార్చవచ్చు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో రూ.7 కోట్లతో మూడు చెరువులను నిర్మించింది. వీటి ద్వారా మొత్తం 1000 ఎకరాలకు సాగు

Published : 27 May 2022 01:34 IST

మరమ్మతుల పాలైన కొత్తచెరువులు
అధికారుల స్పందన అవసరం


నాగులపల్లిలో గుట్టల మధ్యన నిర్మించిన మల్కన్‌దాన్‌ చెరువు

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: అటవీ ప్రాంతంలో గుట్టలపై కురిసిన వర్షం నీరు వృథాగా పోకుండా ఒడిసిపడితే బీడు భూములను పచ్చటి పొలాలుగా మార్చవచ్చు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో రూ.7 కోట్లతో మూడు చెరువులను నిర్మించింది. వీటి ద్వారా మొత్తం 1000 ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది సంకల్పం. ఏటా వానా కాలంలో ఇవి నిండినా ఫలితం ఉండటం లేదు. ఏళ్ల్లు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇందుకు కారణం...పర్యవేక్షణ లోపం, అధ్వాన నిర్వహణ. సాగుకు కొత్తగా జల వనరులు వస్తున్నాయని సంబరపడిన అన్నదాతలు నిరాశకు గురికాక తప్పడంలేదు. అదనంగా మిషన్‌ కాకతీయ ద్వారా నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం కలగడంలేదు. వానా కాలం సీజన్‌కు ఇక ఎంతో సమయం లేదు. కనీసం ఇప్పుడైనా చెరువులను పునరుద్ధరించి పంటలు పండించేందుకు ఉపయోగపడేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

అంబురామేశ్వర అడవిలో...

మండలంలోని సిద్ధన్నమడుగు తండా, తట్టేపల్లి సమీపంలోని అంబురామేశ్వర అడవిలో పెద్ద వాగుపై రెండు గుట్టల మధ్యన 2002లో కొత్తగా ఆత్కూరు చెరువును నిర్మించారు. ఇందుకు రూ.1.20 కోట్లను వెచ్చించారు. ఈ నిధులతో కట్ట, అలుగు, తూముల నిర్మాణం చేపట్టారు. నిధులు సరిపోవడం లేదని అదనంగా మరో రూ.20 లక్షలు కేటాయించారు. వీటితో కాల్వల నిర్మించినా, అప్పటి నుంచి ఎకరం భూమికి నీరు అందలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మిషన్‌ కాకతీయ కింద మరో రూ.50 లక్షలు మంజూరు చేశారు. వీటితో మెరుగులుదిద్ది మమ అనిపించారు. నాణ్యత లేకపోవడంతో తూములు శిథిలమయ్యాయి. కాల్వలు ఆనవాళ్లు కోల్పోయాయి. తూము నుంచి నీరంతా వృథా అవుతోంది. కుడి, ఎడమ కాల్వల ద్వారా 380 ఎకరాలకు సాగు అందాల్సి ఉన్నా, నిర్వహణ కొరవడింది.  


ఇందూరు.. ఇబ్బందులమయం

ఇందూరు అటవీ ప్రాంతంలో గుట్టల కింది భాగంలో ఒట్టి వాగుపై రూ.కోటి నిధులతో 2005లో కొత్త చెరువును నిర్మించారు. 270 ఎకరాలకు సాగు నీటిని అందించాలన్నది లక్ష్యం. ఏడాదిలోనే కట్ట, అలుగు, తూముల నిర్మాణం పూర్తి చేశారు. కాల్వలను సరిగ్గా నిర్మించక పోవడంతో పొలాలకు నీరు చేరడం లేదు. మిషన్‌ కాకతీయ కింద రూ.50 లక్షలు మంజూరయ్యాయి. నామమాత్రంగా పనులు చేపట్టారు. తూములు, షట్టర్లు శిథిలమయ్యాయి. కాల్వలు నీరు రాక చెట్లు, పొదలతో పూడుకుపోయాయి. కుడి, ఎడమ కాల్వలకు గండ్లు పడ్డాయి.  ఏళ్లు గడుస్తున్నా ఎకరం భూమికి సాగు నీరందని దుస్థితి నెలకొంది.


పదేళ్లుగా కాల్వల నిర్మాణానికే పరిమితం

ఆనవాళ్లు కోల్పోయిన ఇందూరు కాలువ

మండలంలోని నాగులపల్లి అటవీ ప్రాంతంలో కొత్తగా మల్కన్‌దాన్‌ చెరువు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. రూ.4 కోట్ల వ్యయంతో నిర్మాణానికి 2012లో శ్రీకారం చుట్టారు. నాలుగేళ్లుగా పనులు జోరుగా సాగాయి. కట్ట, అలుగు, తూములు పూర్తి చేశారు. కాల్వల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అందుకు రైతుల నుంచి భూ సేకరణ చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో అధికారులకు, రైతుల మధ్య చర్చలు జరిగాయి. పలుమార్లు జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు చెరువు ప్రదేశాన్ని సందర్శించారు. పరిహారం ఎంత అనే విషయంలో స్పష్టత రాలేదు. సాగునీరు పారితే తమ భూముల్లో పచ్చని పంటలు పండించి లాభాలు అర్జించవచ్చునని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.


పునరుద్ధరణ పనులు చేపడతాం
నవీన్‌, ఏఈ, నీటిపారుదల శాఖ

కొత్తగా నిర్మించిన ఆత్కూరు, ఇందూరు చెరువులకు పునరుద్ధరణ పనులు చేపడతాం. కాల్వల స్థితిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. నాగులపల్లిలో చివరి దశలో ఉన్నాయి. కాల్వలకు భూసేకరణ చేసి పరిహారం చెల్ల్లిస్తే సమస్య తీరుతుంది. నిర్వాసితుల సమస్య పూర్తికాగానే పనులు మొదలు పెడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని