logo

శరవేగంగా.. క్రీడా ప్రాంగణాల ఎంపిక

పల్లె ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్లో భాగంగా జిల్లాలోని అన్ని మారుమూల తండాల్లోనూ వీటి ఎంపికకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Published : 27 May 2022 01:34 IST
జూన్‌ 2 నాటికి మండలానికి రెండు సిద్ధం
న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ
కామరెడ్డిగూడెంలో స్థల గుర్తింపులో పాల్గొన్న అధికారులు

ల్లె ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్లో భాగంగా జిల్లాలోని అన్ని మారుమూల తండాల్లోనూ వీటి ఎంపికకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డీఆర్‌డీఏ అధికారులు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలిస్తున్నారు. స్థలం కొరత ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.

ఉన్నవాటిలో సౌకర్యాల కొరత

ప్రస్తుతం జిల్లాలో పరిగి, తాండూరు పట్టణాల్లో మాత్రమే ప్రస్తుతం క్రీడా మైదానాలున్నాయి. వీటిలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పరిగిలో ఇటీవల కొత్తగా క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. కుల్కచర్లలో ఇండోర్‌ స్టేడియం ఉన్నా అది ఎవరికీ సరిగ్గా ఉపయోగపడటంలేదు. వికారాబాద్‌లో చిన్న పాటి మైదానం ఉంది. ఇక్కడా సరైన సౌకర్యాలు లేకపోయినా ఇందులోనే తరచుగా ఆటల పోటీలు జరుగుతున్నాయి. పల్లెల్లో సరియైన ఆటస్థలాలు లేక పోవడంతో ఆసక్తి ఉన్న క్రీడాకారుల ప్రతిభ వెలుగు చూడటంలేదు.  

249 స్థలాల గుర్తింపు

జిల్లాలో బుధవారం నాటికి 249 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అభివృద్ధి కోసం అప్పగించారు. ఈ శాఖకు చెందిన సిబ్బంది స్థలాలను పరిశీలించే పనులు చేపట్టారు. ఎకరానికి తక్కువ కాకుండా స్థలం ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బార్‌ (వ్యాయామం) కోసం కోర్టులను సిద్ధం చేయాల్సి ఉంది. ముందుగా స్థలాన్ని చదును చేసి పిచ్చి మొక్కలను తొలగించి క్రీడాకారులు వినియోగించుకునే విధంగా అనుకూలంగా మారుస్తారు. స్థల సమస్య ఉన్న పంచాయతీల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయనున్నారు. స్థలం చుట్టూ హరితహారంలో మొక్కలను నాటుతారు. నియోజక వర్గాల పరిధిలో పరిశ్రమలు ప్రతి ఏటా చెల్లించే కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)నిధులతో క్రీడాకారులకు వసతులు సమకూర్చనున్నారు.


ఎంతో ఉపయోగం

కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, వికారాబాద్‌

జిల్లాలో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి మండలానికి రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పనులు శరవేగంగా చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎంపిక చేసిన స్థలాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. అన్ని విధాలా క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని