logo

తపాలా సేవలు ‘ప్రయోగాత్మకం’

సాంకేతికతను తపాలా శాఖ అందిపుచ్చుకుంటోంది. స్పీడ్‌, రిజిస్టర్‌ పోస్టులకు చిల్లర సమస్యలు ఎదురవుతుండటంతో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేసేలా అడుగు ముందుకు వేసింది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేలా తొలుత జిల్లా కేంద్ర తపాలా కార్యాలయాల్లో

Published : 27 May 2022 01:34 IST
సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న తీరు..
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, వికారాబాద్‌ మున్సిపాలిటీ, మెదక్‌
సంగారెడ్డిలోని హెడ్‌ పోస్టాఫీసు

సాంకేతికతను తపాలా శాఖ అందిపుచ్చుకుంటోంది. స్పీడ్‌, రిజిస్టర్‌ పోస్టులకు చిల్లర సమస్యలు ఎదురవుతుండటంతో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేసేలా అడుగు ముందుకు వేసింది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేలా తొలుత జిల్లా కేంద్ర తపాలా కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ విజయవంతమైతే ఇతర తపాలా కార్యాలయాల్లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో పాటు పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను ప్రజలకు చేరువ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కథనం.

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలని..

ప్రధాన తపాలా కార్యాలయాలు సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, జహీరాబాద్‌, వికారాబాద్‌, తాండూరులో ఉన్నాయి. ప్రధాన తపాలా కార్యాలయాల్లో స్పీడ్‌ పోస్టు, రిజిస్టర్‌ పోస్టులకు సంబంధించిన డబ్బులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డిజిటల్‌ విధానంలో ప్రయోగాత్మకంగా చెల్లించేలా జిల్లా కేంద్రాల్లోని హెడ్‌ పోస్టాఫీసులలో ఇటీవల ప్రారంభించారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలని, చిల్లర సమస్యను అధిగమించాలనేది ప్రధాన లక్ష్యం.

బీమా చేయించేలా..

పోస్ట్లల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవలను పెంచేలా తపాలా శాఖ చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ స్థాయిలో ఏజెంట్లను నియమించి వీటికి సంబంధించి అవగాహన కల్పిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా వారికి కమీషన్‌ చెల్లించి ప్రోత్సహించేలా కసరత్తు చేస్తున్నారు. నెల, మూడు, ఆరు, సంవత్సరం.. ఇలా విడతల్లో చెల్లించే సదుపాయం కల్పించారు. నెల నెలా చెల్లించే మొత్తం ఏడాది ముందుగానే కడితే రెండు శాతం తగ్గింపు సదుపాయం ఉంది. సాధ్యమైనంత ఎక్కువ మందితో బీమా చేయించేలా చర్యలు చేపడుతున్నారు.

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌లో 1.82 లక్షల ఖాతాలు

తపాలా శాఖ ఇతర సేవలను కూడా అందిస్తోంది. ఖాతాలో డబ్బులు జమ చేయడం, రికరింగ్‌ డిపాజిట్లు, ఉత్తరాలు అందించడం వరకు మాత్రమే తపాలా సేవలు పరిమితం అయ్యేవి. కాలానుగుణంగా ఆయా సేవలను విస్తరిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతోంది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 1,82,190 ఖాతాలు ఉన్నాయి. 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న బాలికల పేరు మీద ఖాతా తీసుకోవచ్చు. ఆశీర్వాదం పేరుతో ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి ప్రసాదాలు తీసుకువస్తూ.. వినియోగదారులకు అందజేస్తున్నారు. వెస్టర్న్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా విదేశాల నుంచి పంపిన డబ్బులను తపాలా ద్వారా తీసుకోవచ్చు.

ప్రజలకు మరింత చేరువ కావాలని..: విజయ్‌కుమార్‌, పోస్టల్‌ సూపరింటెండెంట్‌, సంగారెడ్డి

తపాలా శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ పథకాలతో పాటు కొత్త కార్యక్రమాలతో మరింత చేరువ అవుతున్నాం. పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌తో పాటు ఏటీఎం సేవలు అమలు చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని