logo

ఉచితంగా కృత్రిమ అవయవాలు!

దివ్యాంగులు, వయోవృద్ధులకు చేదోడుగా నిలిచేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. పట్టణ సామాజిక అభివృద్ధి(యూసీడీ) విభాగం ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా శిబిరాలు నిర్వహించి.. కృత్రిమ అవయవ మార్పిడికి అర్హులను గుర్తించాలని నిర్ణయించింది.

Published : 27 May 2022 02:34 IST

దివ్యాంగులు, వృద్ధులకు జీహెచ్‌ఎంసీ చేయూత

ఈనాడు, హైదరాబాద్‌: దివ్యాంగులు, వయోవృద్ధులకు చేదోడుగా నిలిచేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. పట్టణ సామాజిక అభివృద్ధి(యూసీడీ) విభాగం ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా శిబిరాలు నిర్వహించి.. కృత్రిమ అవయవ మార్పిడికి అర్హులను గుర్తించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పేరుగాంచిన అలెమ్కో సంస్థతో బల్దియా ఒప్పందం చేసుకోనుంది. అలెమ్కో(ఏఎల్‌ఐఎంసీఓ-ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో కలిసి అర్హులను గుర్తిస్తామని, అవసరమైన శస్త్రచికిత్సలతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని అధికారులు చెబుతున్నారు. బల్దియా స్థాయీ సంఘంలో ప్రతిపాదన ఆమోదం పొందగానే.. శిబిరాలు ఏర్పాటు చేసి ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అలెమ్కో సంస్థ 350 రకాల నాణ్యమైన కృత్రిమ అవయవాలను, తుంటి ఎముకలను తయారు చేస్తుంది. శిబిరాల కోసం ఆ సంస్థ ఇద్దరు అవయవాల మార్పిడి నిపుణులను, ఎముకల నిపుణులను, శబ్ద నిపుణులను, సహాయకులను కేటాయించనుంది.


3వేల మందికి లబ్ధిచేకూర్చేలా..

వైద్య నిపుణులతో నగరవ్యాప్తంగా 15 శిబిరాలు నిర్వహించి, 3 వేల మందిని ఎంపిక చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్‌ 20 నుంచి జులై 6 వరకు శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. వారందరికీ గరిష్ఠంగా రూ.2కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. 60ఏళ్లు దాటిన వారిలో తుంటి ఎముక సమస్యలు అధికంగా కనిపిస్తుంటాయని, వారికి ఈ నిర్ణయం సహాయపడుతుందని చెబుతున్నారు. అవయవాలను కోల్పోయిన వారికి, దివ్యాంగులకు మేలు చేస్తుందంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని