logo

జీవీపీఆర్‌ సంస్థ యాజమాన్యంపై కేసు

ఓ కాంట్రాక్టర్‌ వేధింపులు భరించలేక సబ్‌ కాంట్రాక్టర్‌ కుటుంబం సహా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనలో సంబంధిత సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. పంజాగుట్ట హిందీనగర్‌లో ప్రధాన కార్యాలయం

Published : 27 May 2022 03:53 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ఓ కాంట్రాక్టర్‌ వేధింపులు భరించలేక సబ్‌ కాంట్రాక్టర్‌ కుటుంబం సహా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనలో సంబంధిత సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. పంజాగుట్ట హిందీనగర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన జీవీపీఆర్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ సంస్థ విద్యుత్‌ శాఖ నుంచి విద్యుత్‌ పనులు చేసేందుకు కాంట్రాక్ట్‌ పొందింది. ఖమ్మం జిల్లాలోని మదిర, వైరా, కొణిజర్ల ప్రాంతాల్లో సంస్థ పొందిన కాంట్రాక్ట్‌ను ఖమ్మం పట్టణం కన్నాపురంవాసి శశికుమార్‌కు సబ్‌ కాంట్రాక్టుగా ఇచ్చారు. పనులను పూర్తి చేసిన అనంతరం డబ్బులు చెల్లించాలని కార్యాలయం చుట్టూ అతడు పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన శశికుమార్‌ బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ లాడ్జ్‌లో భార్య శ్వేత, ఇద్దరు పిల్లలతో దిగి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి బావమరిది సురేష్‌ కుమార్‌కు పంపాడు. వెంటనే సురేష్‌ 100కు డయిల్‌ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సదరు లాడ్జ్‌కు వెల్లి శశికుమార్‌ కుటుంబాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో వెంటనే నగరానికి వచ్చిన సురేష్‌.. జీవీపీఆర్‌ యాజమాన్యం తీరుతోనే తన బావ కుటుంబం సహా ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి జీవీపీఆర్‌ సంస్థ కార్యాలయం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండటంతో ఈ ఠాణాకు బదిలీ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని