logo

రాతిరేళ బస్సు.. ఆదరణ మస్తు

నగర ప్రయాణికుల కోసం రాత్రి వేళ తిరిగే బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురాగా వాటికి చక్కని ఆదరణ లభిస్తోంది. గతంలో ఉన్న ఈ సర్వీసులను రెండు మూడేళ్లుగా పక్కన పెట్టేసింది. రాత్రి 10 గంటలు దాటితే ప్రజారవాణా అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన ఆర్టీసీ ఇటీవల ఈ సర్వీసులను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కొన్ని మార్గాలను ఎంపిక చేసుకుని ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

Updated : 28 May 2022 06:45 IST

మరిన్ని మార్గాలకు విస్తరించే పనిలో ఆర్టీసీ అధికారులు


అర్ధరాత్రి ప్రయాణిస్తున్న సిటీ సర్వీసు

ఈనాడు, హైదరాబాద్‌: నగర ప్రయాణికుల కోసం రాత్రి వేళ తిరిగే బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురాగా వాటికి చక్కని ఆదరణ లభిస్తోంది. గతంలో ఉన్న ఈ సర్వీసులను రెండు మూడేళ్లుగా పక్కన పెట్టేసింది. రాత్రి 10 గంటలు దాటితే ప్రజారవాణా అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన ఆర్టీసీ ఇటీవల ఈ సర్వీసులను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కొన్ని మార్గాలను ఎంపిక చేసుకుని ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి పలు మార్గాలకు నడుస్తున్న ఈ సర్వీసులకు 75 శాతం ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో) ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరి కొన్ని మార్గాలను కూడా జోడించాలని ప్రయత్నం చేస్తున్నారు.

కొత్తగా తలపెట్టిన మార్గాలివే..

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రీజియన్‌లలో మొత్తం 20 బస్సులు రాత్రి పూట కూడా నడుపుతున్నామని ఆర్‌ఎంలు వెంకన్న, రాజేంద్రప్రసాద్‌ గతంలో ప్రకటించారు. ఇలా నగరవ్యాప్తంగా ముఖ్యమైన మార్గాల్లో రాత్రి 10 నుంచి తెల్లవారు జాము 4 గంటల వరకూ వరకూ 20 బస్సులు నడుపుతున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి పటాన్‌చెరు, అఫ్జల్‌గంజ్‌, బోరబండ, మెహిదీపట్నం ప్రస్తుతం నడపగా.. కొత్తగా సికింద్రాబాద్‌-పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ మార్గంలో నడిచే 47 ఎల్‌ను కూడా రాత్రి పూట అందుబాటులో ఉంచడానికి, సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌ నడిచే 10 హెచ్‌ సర్వీసులు కూడా రాత్రి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయాణికుల రద్దీని పరిశీలిస్తున్నామని ఆర్‌ఎం వెంకన్న చెప్పారు. అలాగే హైదరాబాద్‌ రీజియన్‌ మొత్తం 56 సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఇవన్నీ ప్రయాణికుల ఆదరణ పొందాయని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. పటాన్‌చెరు నుంచి కోఠి, సీబీఎస్‌కు 222 నంబరు బస్సు రెండు ట్రిప్పులు నడుస్తున్నాయి. కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి బంజారాహిల్స్‌ మీదుగా ఇదే నంబరు బస్సులను నడపాలని నిర్ణయించారు. అలాగే 127 మార్గంలో తిప్పాలని భావించారు. ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతాల్లో కూడా బస్సులు నడపాలని చూస్తున్నారు.

50 బస్సుల వరకూ పెంపు..

ప్రస్తుతం నగరంలో రాత్రి పూట 20 బస్సులు తిరుగుతున్నాయి. వీటికి ఆదరణ బాగుండడంతో బస్సుల సంఖ్య 50 వరకూ పెంచాలని భావిస్తున్నారు. డిపో మేనేజర్లను ఇప్పటికే కొత్త మార్గాలను గుర్తించాలని సూచించారు. ఐటీ కార్యాలయాలు పూర్తి స్థాయిలో త్వరలో పనులు మొదలు పెట్టనున్న నేపథ్యంలో బాచుపల్లి-వేవ్‌రాక్‌ పార్కుకు కూడా బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లింగంపల్లి, బేగంపేట, కాచిగూడ, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి పూట బస్సులుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మల్కాజిగిరి, ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్సుకు కూడా బస్సులు రాత్రిపూట ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రిపూట రహదారులు కూడా ఖాళీగా ఉండడంతో బస్సులు సమయపాలన కూడా పాటించడానికి వీలుంటోందని.. ప్రయాణికులుండే అన్ని మార్గాలకు విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని