logo
Published : 28 May 2022 01:49 IST

హోటళ్లలో భోజన సందడి

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాతో అతలాకుతలమైన ఆతిథ్యరంగం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. కరోనా వేవ్‌ మధ్య తొణికిసలాడిన వ్యాపారం వృద్ధి బాటన పయనిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌, కొవిడ్‌ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో హోటళ్లలో పూర్వపు రద్దీ కనిపిస్తోంది. పుట్టిన రోజు, పెళ్లిరోజుతో పాటు ఇతర వేడుకల సందర్భాల్లోనూ సరదాగా కుటుంబంతో కలిసి హోటల్‌కి వెళ్లి కలిసి భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జేఎల్‌ఎల్‌ హోటల్‌ మూమెంటమ్‌ ఇండియా ఇదే విషయాన్ని తన అధ్యయనంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా బెంగళూరు, చెన్నై, దిల్లీ, గోవా, హైదరాబాద్‌, ముంబయి నగరాల్లో వ్యాపారంపై అధ్యయనం చేసిన సంస్థ ‘క్యూ-1 2022’ రిపోర్టులో ఈ వివరాలు వెల్లడించింది. స్టార్‌, బడ్జెట్‌ హోటళ్లలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్‌ నగరం 64 శాతం వృద్ధి సాధించినట్లు వెల్లడించింది.

ఫుడ్‌ ఆర్డర్ల జోరు..

ఆహార రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు, సాంకేతికతల జోడింపుతో హోటళ్లు, రెస్టారెంట్లు కోట్లాది రూపాయల టర్నోవర్‌తో దూసుకుపోతున్నాయి. ఆన్‌లైన్‌ సర్వీస్‌కు మంచి డిమాండ్‌తో గిరాకీ పుంజుకుంది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు యాప్‌లు రూపొందించుకుని హోం డెలివరీ ఇస్తున్నాయి. ఇటీవల తెలంగాణ స్టేట్‌ అసోసియేషన్‌ సేకరించిన లెక్కల ప్రకారం నగరంలో నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్లు 60శాతం కాగా.. వెజిటేరియన్‌ 30 శాతం.. స్వీట్‌, ఇతర ఆహారపదార్థాలు 10 శాతంగా ఉన్నాయి. గతంలో స్విగ్గీ, జొమాటో జరిపిన సర్వేలో చికెన్‌ బిర్యానీ వాటా 50 శాతంగా ఉందని తేల్చాయి. ఏప్రిల్‌ 2 నుంచి 22 వరకు చేసిన అధ్యయనంలో స్విగ్గీ వెలువరించిన కీలకాంశాలను పరిశీలిస్తే..మటన్‌ హలీమ్‌తో పాటు పాయ నిహారీలు, సమోసాలు, రబ్డీ, మాల్పువా వంటకాలపై ఆర్డర్లు పెరిగినట్లు స్విగ్గీ తెలిపింది.

హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

నగరంలోని చిన్నా, చితకా, బడ్జెట్‌ హోటళ్లు, రెస్టారెంట్లు సుమారు 15,000

ఆన్‌లైన్‌ ఫుడ్‌ సేవలు అందించేవి 5000

నగరంలో ప్రతిరోజు వ్యాపారం రూ.10కోట్లు

నెలకు జరిగే వ్యాపారం రూ.300 కోట్లు

ఐటీ కారిడార్‌లో నెలకు ఫుడ్‌ ఆర్డర్లు 3లక్షలు

గ్రేటర్‌లో పనిచేసే డెలివరీ బాయ్స్‌ 40వేలు

ప్రతిరోజు ఒక్కో డెలివరీ బాయ్‌ చేసే డెలివరీలు 20-30

ఐటీ కారిడార్‌లోనే ఎక్కువ

గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, రాయదుర్గం ప్రాంతాల్లో యాప్‌ ఆధారిత సేవలు అధికంగా ఉంటున్నాయని హోటల్‌ వర్గాలు చెబుతున్నాయి. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పని చేస్తుండటంతో వారంలో కనీసం నాలుగు రోజులైనా హోటల్‌, రెస్టారెంట్‌లకు వెళ్తున్నారు. మరికొందరు ఉద్యోగం చేస్తూనే నచ్చిన వంటకాన్ని ఆర్డర్‌ ఇస్తున్నారు.

 


పరిస్థితి మెరుగుపడింది

వెంకట్‌రెడ్డి, హోటల్స్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షుడు

గతంతో పోల్చితే పరిస్థితి కాస్త మెరుగుపడింది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో హోటళ్లలో రద్దీ కనిపిస్తోంది. ఆన్‌లైన్‌ సర్వీసు ఉన్నవారికి వ్యాపారం లాభసాటిగా మారింది. క్యాటరింగ్‌, బాంకెట్‌హాళ్లలో ఆక్యుపెన్సీ పెరిగింది. కరోనా సీజన్‌తో పోల్చితే వ్యాపారం 50శాతం వృద్ధి చెందింది. అక్టోబర్‌కు మరింత వృద్ధి చెందుతుందనుకుంటున్నాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని