logo

జోరు వానలో ఆటో కారు ఢీ

రంగారెడ్డి జిల్లాలో నాగార్జునసాగర్‌ రహదారిపై యాచారం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, ఓ విద్యార్థి మృతి చెందారు. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..

Published : 28 May 2022 01:49 IST

ఆటో డ్రైవర్‌, విద్యార్థి మృతి


వట్టిపల్లి శేఖర్‌

యాచారం, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లాలో నాగార్జునసాగర్‌ రహదారిపై యాచారం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, ఓ విద్యార్థి మృతి చెందారు. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. యాచారం సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(శంషాబాద్‌)లో 74మంది 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం పదో తరగతి పాఠ్యాంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. శుక్రవారంతో పూర్తి కావడంతో మధ్యాహ్నం తరువాత ఇళ్లకు పంపారు. గండిపేట మండలం కాళీపేట్‌కు చెందిన రోహిత్‌, కరుణాకర్‌, హయత్‌నగర్‌కు చెందిన శ్రీహర్ష, గండిపేట మండలం గంధంగూడకు చెందిన మల్లికార్జున్‌, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్లకు చెందిన ప్రదీప్‌ ఆటో లో స్వస్థలాలకు బయలుదేరారు. తల్లిదండ్రుల అనుమతితోనే ఉపాధ్యాయులు వీరిని ఆటోలో ఇళ్లకు పంపారు. బయలుదేరినప్పుడు ప్రారంభమైన వర్షం తిరుమలనాథుని గుట్ట దాటుతుండగా ఎక్కువైంది. దారి సరిగా కనిపించలేదు. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన ఆటోడ్రైవరు, ఎదురుగా వస్తున్న కారును గుర్తించకలేకపోయాడు. రెండు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. యాచారం మండలం నల్లవెల్లికి చెందిన డ్రైవర్‌ వట్టిపల్లి శేఖర్‌(40) అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటి తరువాత విద్యార్థి రోహిత్‌ కన్నుమూశాడు. గాయపడిన కరుణాకర్‌, శ్రీహర్షలను 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున్‌, ప్రదీప్‌లకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఎస్సై వెంకటనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం

కృష్ణా పైప్‌లైన్‌ మరమ్మతుల కోసం ఆరు నెలల క్రితం తిరుమలనాధుని గుట్ట సమీపంలో సాగర్‌ రహదారిని నాలుగు అడుగుల మేర తవ్వారు. మరమ్మతుల అనంతరం రహదారిని తిరిగి నిర్మించలేదు. ఇక్కడ ప్రమాదం పొంచి ఉన్న విషయంపై ఇటీవల ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. సరిగ్గా రోడ్డు తవ్విన చోటనే ఆటో అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని